ఒకట్రెండు రోజుల్లో ఆర్టీసీ రూపం మార్పు 

ఉద్యోగాలలో చేరాలని తాను ఇచ్చిన గడువును ఆర్టీసీ కార్మికులు పట్టించుకోకపోవడంతో ఇక తనదైన దారిలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌రావు  నిర్ణయించుకున్నట్లు తెలిసింది. “ఇక కథ ముగిసినట్లే. ఆర్‌టిసి ఇప్పుడున్న రూపంలో ఇక ఎంతమాత్రం కొనసాగదు. ఇది ఖాయం. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధపడుతోంది” అని అధికార వర్గాలు వివరించాయి. 

ఈ దశలో ఆర్‌టిసి కార్మికుల డిమాండ్లకు తలొగ్గితే భవిష్యత్తులో వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల, ఏది ఏమైనా కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆర్‌టిసి విషయంలో ముఖ్యమంత్రి వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ముందే చెప్పిన్నట్లుగా ఆర్టీసీ స్వరూపం మార్చేందుకు ఒకటి, రెండు రోజులలో నిర్దుష్టమైన చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కార్మికుల డిమాండ్లకు తలొగ్గే పరిస్థితి కూడా లేదు. అవసరమైతే ఈ సమ్మెను, దానిపై నిర్ణయాన్ని న్యాయస్థానాలకు వదిలి వేయాలని, ప్రజలకు రవాణా సౌకర్యాల విషయంలో తమదైన ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ న్యాయ వివాదం ఎంత సుదీర్ఘంగా కొనసాగినా అందుకు సిద్ధపడాలని, అక్కడే అమీ తుమీ తేల్చుకోవాలని కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లుచెబుతున్నారు. 

ప్రగతి భవన్‌లో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు.  అత్యంత పకడ్బందీగా హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది. ఆర్‌టిసికి, ప్రభుత్వం బకాయిలు ఉండడం కాదని, ఆర్‌టిసియే ప్రభుత్వానికి బకాయి ఉందని కోర్టుకు సమర్పించిన అఫిడవిలో స్పష్టం చేసింది. అవసరమైతే, ఇలాంటి అంశాల్లో ఎవరి అధికార పరిధులు ఎంత వరకూ అనే చర్చకు కూడా తెరతీయాలనే ఉద్దేశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా ఆర్‌టిసి కార్మికులకు విధుల్లోకి చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. దీనికి ప్రభుత్వం ఊహించిన స్థాయిలో కార్మికులు విధుల్లోకి చేరకపోవడంతో ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా 5100 రూట్లలో ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఒకటి, రెండు రోజుల్లో జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా సిద్దమయ్యాయి. 

గడువులోగా కార్మికులు విధుల్లోకి చేరకపోతే మొత్తం ఆర్‌టిసి ప్రైవేటు పరం చేస్తామని కూడా సిఎం కెసిఆర్ ఇప్పటికే హెచ్చరించారు. దీంతో ఆర్‌టిసిలో మిగిలిన 5,000 బస్సుల స్థానంలో ప్రభుత్వం ప్రైవేటుకు పర్మిట్లు ఇచ్చే అంశంపై కూడా సమీక్షలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని ఉపయోగించుకోనుంది.