10 శాతం చమురు దిగుమతులు తగ్గించాలి 

భారతదేశం చమురు దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి గాను వచ్చే 2022 నాటికి చమురు దిగుమతులను 10 శాతం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ప్రకటించారు. 

దేశం చమురు దిగుమతిపై ఆధారపడటాన్ని 2022 నాటికి 77 శాతం (2013 -2014) నుంచి 67 శాతానికి తగ్గించాల్సి ఉంటుందని 2015 మార్చిలో జరిగిన ‘ఉర్జ సంగం’ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ప్రసంగించారు. 2022 లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను నిర్వహించనుంది, అందువల్ల మోడీ ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు.

అయితే వేగంగా పెరుగుతున్న వినియోగం, పరిమిత ఉత్పత్తి కారణంగా చమురు దిగుమతి ఆధారపడటం 2017-18లో 82.9 శాతం నుండి 2018-19లో 83.7శాతానికి పెరిగింది. అయితే పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ‘మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మేము చమురు దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా పయనిస్తున్నాం’ అని తెలిపారు. 2022నాటికి 10 శాతం లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు. 

2030 నాటికి చమురు దిగుమతి సగం వరకు తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీవ ఇంధనాల వాడకాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలాగే దిగుమతులను తగ్గించడానికి దేశీయ ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. పెట్రోల్ నుంచి ఇథనాల్ తీయడం వల్ల ఇంధన అవసరాలు కూడా తీరతాయని, చమురు దిగుమతులపై ప్రభావం చూపుతుందని చెప్పారు. 

పెట్రోలి యం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, చమురు వినియోగం 2015-16లో 184.7 మిలియన్ టన్నుల నుండి 2016-17లో 194.6 మిలియన్ టన్నులకు, మరుసటి సంవత్సరం 206.2 మిలియన్ టన్నులకు పెరిగింది. 2018-19లో ఈ డిమాండ్ 2.6 శాతం పెరి గి 211.6 మిలియన్ టన్నులకు చేరుకుంది.