ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు  

దేశీయంగా ఉల్లి ఉత్పత్తి 30-40 శాతం పడిపోవడంతో రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.80కు చేరుకుందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఉల్లి ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో బుధవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.  

రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఉల్లి విత్తడం ఆలస్యమైంది. తర్వాత వచ్చిన వరదలతో పంట దెబ్బతిన్నదని కేంద్రమంత్రి చెప్పారు. సప్లై డిమాండ్‌ను బట్టి ధరలు మారుతుంటాయని, ప్రస్తుతం ఈ రెండింటికీ సామ్యం లేదని తెలిపారు. అయినా ఉల్లిపాయలు లభించేలా చూడ్డానికి, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెబుతూ పాశ్వాన్ పేర్కొన్నారు. 

‘పరిస్థితిని మేము గమనించాం. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది’ అన్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పడానికి తానేం జ్యోతిష్కుడిని కానని, కానీ నవంబర్ చివరలో లేదా డిసెంబర్ మొదట్లో తగ్గవచ్చని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి చెబుతూ కేంద్రమంత్రి ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించామని, వ్యాపారుల నిల్వలపై పరిమితి విధించామని, నిల్వలను చౌకగా కిలో రూ. 24.50 కి అందిస్తున్నామని, దిగుమతి నిబంధనల్ని సడలించమని వ్యవసాయ శాఖను కోరామని వివరించారు.