భారీగా హెచ్‌-1బీ వీసాల తిరస్కరణ  

ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికా ఓ చిరకాల స్వప్నం. ఆ దేశంలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఇచ్చే హెచ్‌-1బీ వీసా కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసేవారు ఎందరో. కానీ.. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం భారతీయ ఇంజినీర్ల ఆశలను చిదిమేస్తున్నది. భారీ సంఖ్యలో హెచ్‌-1బీ వీసాలను తిరస్కరిస్తున్నది. అమెరికాకు చెందిన నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 

ఈ సంస్థ అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్‌) నుంచి వివరాలను సేకరించి, విశ్లేషించింది. తిరస్కరణకు గురవుతున్న హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయ కంపెనీలవే ఎక్కువగా ఉంటున్నాయని తేల్చింది. అమెరికాలోని దిగ్గజ కంపెనీలు భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ఇంజినీర్లను ఉద్యోగులుగా నియమించుకుంటాయి. వారు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతి కోసం అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తాయి.

ప్రభుత్వం వాటిని పరిశీలించి హెచ్‌-1బీ వీసాలు మంజూరు చేస్తుంది. గతంలో హెచ్‌-1బీ వీసా లబ్ధిదారుల్లో భారతీయులే అధిక సంఖ్యలో ఉండేవారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక వలస విధానాలను కఠినతరం చేయడంతోపాటు భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని పలు ఆంక్షలు విధించారు. దీంతో ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి భారతీయ కంపెనీలు సమర్పించే హెచ్‌-1బీ వీసాల దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి. 

ఇది 2015లో 6 శాతం ఉండగా, ఈ ఏడాది తృతీయ త్రైమాసికంలో 24 శాతానికి చేరింది. అదే సమయంలో అమెరికా కేంద్రంగా పనిచేసే అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, గూగుల్‌ వంటి సంస్థలు ఇచ్చిన దరఖాస్తులను కండ్లకు అద్దుకొని తీసుకుంటున్నారు. ఆయా సంస్థలు 2015లో సమర్పించిన దరఖాస్తుల్లో ఒక శాతం మాత్రమే పక్కనబెట్టగా, ఈ ఏడాది 3-8 శాతంగా నమోదైంది.

2015తో పోల్చితే తిరస్కరణకు గురవుతున్న భారతీయ కంపెనీల దరఖాస్తుల సంఖ్య నాలుగేండ్లలో తొమ్మిదిపదిరెట్ల మేర పెరిగింది. టెక్‌ మహీంద్రాకు సంబంధించి 2015లో తిరస్కరణ నాలుగు శాతం ఉండగా, ఈ ఏడాది అది 41 శాతానికి పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఆరు శాతం నుంచి 34 శాతానికి, విప్రోలో ఏడు శాతం నుంచి 53 శాతానికి, ఇన్ఫోసిస్‌లో రెండు శాతం నుంచి 45 శాతానికి పెరిగింది. 

అమెరికా కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్న ఆక్సెంచర్‌, క్యాప్‌జెమిని వంటి 12 కంపెనీలు ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో అందించిన దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా పక్కనబెట్టినట్టు నివేదిక వెల్లడించింది. 2015లో ఇది 2-3 శాతంగా ఉండేదని పేర్కొన్నది. అదేసమయంలో అమెజాన్‌, ఇంటెల్‌ (ఒకశాతం నుంచి మూడు శాతానికి), గూగుల్‌ (0.4 శాతం నుంచి ఒక శాతానికి), మైక్రోసాఫ్ట్‌ (రెండుశాతం), ఆపిల్‌ (ఒకశాతం) వంటి అమెరికా కంపెనీల దరఖాస్తులను ఎడాపెడా ఆమోదించేస్తున్నారని అధ్యయనం స్పష్టం చేసింది.