మాతృభాషలో విద్యాబోధనకు జగన్ మంగళం!

దేశ వ్యాప్తంగా మాతృభాషలో విద్యాబోధనకు ప్రోత్సహించాలని నూతన విద్య విధానం ద్వారా ప్రయత్నం జరుగుతూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్  జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం మాత్రం మాతృభాషలో విద్యాబోధనకు మంగళం పాడాలని నిర్ణయించింది. ఇక నిర్బంధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోని అన్ని తరగతులను ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తూ  ఆదేశాలు జారీ చేసింది. 

ఒకటి నుంచి ఎనిమిది తరగతులను వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి, తొమ్మిదో తరగతికి 2021–22 నుంచి, పదో తరగతికి 2022–23 నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక తెలుగు మీడియంకు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడి చేసింది. ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను కేవలం తప్పనిసరి సబ్జెక్టుగా మాత్రమే చదవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌  ఉత్తర్వులు జారీ చేశారు. 

అన్ని స్కూ ళ్లలో ఇంగ్లిష్‌ మీడియంను అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు అప్పగించి అందుకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు.  ఇంగ్లిష్‌ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అర్హులైన అభ్యర్థులను మాత్రమే భవిష్యత్తులో జరిగే టీచర్ల నియామకాల్లో నియమించుకోవాలని ఆదేశించారు.  

పాఠ్యపుస్తకాల ముద్రణ డైరెక్టర్‌ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నమోదైన విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇంగ్లిష్‌ మీడియం పాఠ్యపుస్తకాలను సరఫరా చేసేందుకు వీలుగా కచ్చితమైన ఇండెంట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు తెలుగు మీడియంలో పాఠాలు చెప్పిన టీచర్లకు డిసెంబర్ నుంచి  దశల వారీగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.