పోలీసుల అయ్యప్ప దీక్షలపై ఆంక్షలు 

పోలీసుల అయ్యప్ప దీక్షలపై తెలంగాణలో ఆంక్షలు ప్రారంభమయ్యాయి. విధి నిర్వహణలో ఉంటూ అటువంటి దీక్షలు చేయరాదంటూ నిర్బంధాలు ఎదురవుతున్నాయి. మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీసులు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా యూనిఫాం ధరించాల్సిందేనని అంటూ ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 

అయ్యప్ప దీక్ష సమయంలో పోలీసు సిబ్బంది ఆచరించే నియమాల నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటారు. ఇందుకు సంబంధించి కమిషనరేట్‌ పరిధిలోని ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీస్‌ సిబ్బంది అధికారుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధంగా అనుమతులు పొంది దీక్షలు చేపట్టడం దశాబ్దాల కాలంగా జరుగుతున్నది. 

అయితే వాటన్నింటిని పరిశీలించిన సీపీ మహేష్‌ భగవత్‌ ప్రధాన కార్యాలయం జారీ చేసిన మెమో నెం. 987/ఈ3/2011 ప్రకారం యూనిఫాం, షూ లేకుండా పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహించడం కుదరదని స్పష్టం చేశారు. అయ్యప్ప దీక్ష చేపట్టే సిబ్బంది సెలవు తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్‌ శాఖలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదన్నారు. పోలీస్‌ సిబ్బంది గడ్డాలు, మీసాలు పెంచి విధులు నిర్వహించడం కుదరదని చెప్పారు. అవసరమైన వారు రెండు నెలలపాటు సెలవుతీసుకుని దీక్ష చేపట్టవచ్చని పేర్కొన్నారు   

కాగా, సీపీ మహేష్‌భగవత్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్పమాల వేసుకొని డ్యూటీకి రావొద్దని మెమో జారీ చేయడమేంటి?, రంజాన్ అప్పుడు ఇలాంటి మెమోలు రిలీజ్ చేయాలని అనిపించలేదా?, హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టమా? అని ప్రశ్నించారు. ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలాంటి స్వేచ్ఛ ఇస్తారో.. హిందువులకు కూడా అలాంటి స్వేచ్ఛ ఇవ్వాలని స్పష్టం చేశారు. 

ఎవరి ఒత్తిడి మేరకు ఈ ఆదేశాలు ఇచ్చారు?, ఈ ఆదేశాలు పైనుంచి వచ్చాయా?, సీఎం నుంచి వచ్చాయా?, ఎంఐఎం ఆఫీసు నుంచి ఈ మెమో రిలీజ్ అయితే అందరికి ఫార్వర్డ్ చేస్తున్నారా? అని రాజాసింగ్ నిలదీశారు. తెలంగాణలో అందరూ కలిసిమెలసి ఉంటున్నారని చెబుతూ పోలీసుల్లో ఎందుకు ఈ తేడాలను తెస్తున్నారు?, రంజాన్ సమయంలో టోపీలు, గడ్డాలు తీసేయాలని మెమోలు జారీ చేయగలరా? అని ప్రశ్నించారు. 

అయ్యప్పమాల వేసుకున్న వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరించారు.