తలాక్ పట్ల ముస్లిం మహిళల హర్షం

ట్రిపుల్ తలాక్ పై ఆర్డినెన్స్ తీసుకు రావాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హైదరాబాద్ లోని పలువురు ముస్లిం మహిళలు హర్షం ప్రకటిస్తున్నారు. కొందరు మహిళలు రాష్ట్ర బిజెపి కార్యాలయానికి చేరుకొని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు డా. కే లక్ష్మణ్, ఇతర నాయకులకు స్వీట్లు అందించారు. లింగ సమానత్వం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్లు  డాక్టర్ కె.లక్ష్మణ్ ఈ  సందర్భంగా స్పష్టం చేశారు. ముస్లిం మహిళల సాధికారికత కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని చెబుతూ ఈ నిర్ణయానికి మతానికి సంబంధం లేదని పేర్కొన్నారు.

కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని భరోసా వ్యక్తం చేసారు. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఎవరు ట్రిపుల్  తలాక్ చెప్పినా నేరమే అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తు  ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుకుందని దయ్యబట్టారు.

జాతీయ బీసీ కమిషన్‌ను రాజ్యాంగ బద్ధం చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటే అప్పుడు కూడా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని గుర్తు చేసారు. లౌకికవాదులమని చెప్పుకునే వారితో పాటు కాంగ్రెస్ కూడా ధ్వంధ్వ నీతి అవలంబిస్తున్నారని విమర్శించారు.

ట్రిపుల్ తలాక్‌పై చట్టం చేయడాన్ని ‘ముస్లిం పర్సనల్ లా బోర్డు’ కూడా వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ బోర్డు కోరుకునే ట్రిపుల్ తలాక్ కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీరు కోరుకునే ట్రిపుల్ తలాక్ ఇస్లాంతో పాటు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేసారు.  అనేక ముస్లిం దేశాలు ఈ ట్రిపుల్ తలాక్‌ను ఎప్పుడో నిషేధించిన సంగతిని ఆయన ప్రస్తావించారు.