విపక్షంలోనే కూర్చుంటాయని పవార్‌ స్పష్టం  

మహారాష్ట్రలో శివసేనతో గాని, మరే పార్టీతో గాని కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన తమ పార్టీకి లేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, ఎన్సీపీలు విపక్షంలోనే కూర్చుంటాయని శరద్‌ పవార్‌ చెప్పారు. శివసేనతో ఎన్సీపీ చేతులు కలపదని ఆయన తేల్చిచెప్పారు. శివసేన - ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రశ్నే లేదన్నారు. ప్రజలు తమకు ప్రతిపక్షంలో ఉండమని తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 

శివసేన - బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెబుతూ వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు.  గత 25 ఏళ్ల నుంచి బీజేపీ - శివసేన కలిసి ఉన్నాయని పేర్కొంటూ ఇవాళ, రేపో ఆ రెండు పార్టీలే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ బీజేపీ - శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన తప్పదని హెచ్చరించారు.

కాగా, శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఇవాళ ఉదయం తనను కలిశారు అని శరద్‌ పవార్‌ చెప్పారు. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటుకు తమ పార్టీ మద్దతును ఆయన కోరారని వస్తున్నా వార్తలను ఆయన కొట్టిపారవేసారు. త్వరలో జరిగే రాజ్యసభ సెషన్స్‌పై తనతో సంజయ్‌ చర్చించారని పేర్కొన్నారు. రాజ్యసభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించామని శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు.

175 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉన్నట్లు రౌత్ పేర్కొనడాన్నీ ప్రస్తావించగా  ఆ ప్రకటనలో స్పష్టత లేదని పవర్ త్రోసిపుచ్చారు.