జగన్ పాలనపై అదుపు కోల్పోతున్నారా!

ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి అచ్చిన ఐదు నెలలకే పాలనాయంత్రాంగంపై అదుపు కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ఆయనకు అంతుబట్టడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ నుండి తనకు చెప్పకుండా ఒక జిఓను మార్చివేస్తారని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం వరకు చూస్తుంటే పరిపాలన గాడితప్పిన్నట్లే భావించవలసి వస్తున్నది. 

‘నాకు చెప్పకుండా పేరు ఎలా మారుస్తారు. వెంటనే జీవో మార్చేయండి. అబ్దుం కలాం పేరు కొనసాగించండి.’ అంటూ అధికారులపై రుసరుసలాడటం అధికార వర్గాలకే విస్మయం కలిగిస్తున్నది.  విద్యా శాఖ సోమవారం నాడు ఓ ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రతి ఏటా డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార అవార్డులు పేరిట అవార్డులు ఇచ్చేవారు. 

అయితే పాఠశాల విద్యా శాఖ ఈ ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేరిట ‘వైఎస్ఆర్ విద్యా పురస్కారాలు’ పేరిట మంజూరు చేయటానికి వీలుగా జీవో 78 జారీ చేసింది. అయితే ఇది వివాదస్పదం కావటంతో ముఖ్యమంత్రి స్పందించారు. తక్షణమే జీవో 78ని రద్దు చేసి..అబ్దులా కలాం పేరు మీదే అవార్డులు కొనసాగించాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో  కూడా కలకలం రేపుతోంది.

మాజీ రాష్ట్రపతి..దేశంలో కోట్లాది మంది అభిమానించే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న అవార్డులకు ఆయన పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ జీవో ఇవ్వటం…మళ్ళీ దాన్ని మరుసటి రోజే  రద్దు చేయాలని నిర్ణయించటంతో అసలు ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది అంటూ వైసీపీ నేతలు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీనే ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్స్ కు సంబంధించిన ఫైలు ఆర్ధిక శాఖకు పంపకుండా నేరుగా కేబినెట్ లో పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎస్ ఏకంగా సీఎంవోలోని కార్యదర్శి ప్రవీణ్ ఫ్రకాష్ కు మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం మాత్రం తాను చెపిన తర్వాత ..కేబినెట్ ఆమోదించాక ఎల్వీ అభ్యంతరాలు వ్యక్తం చేయటంపై అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు.