అన్నదాతలకు గుదిబండగా ప్రభుత్వ షరతులు

రైతు భరోసాకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులు అన్నదాతలకు గుదిబండగా మారాయి. కేంద్ర పథకం పిఎం కిసాన్‌తో కలిపి సొంత భూమి కలిగిన రైతులకు సైతం భరోసా ఒక పట్టాన అందట్లేదు. దరఖాస్తులకు తుది గడువు ఈ నెల 15 కాగా ఆ లోపు అర్హులైన వారందరికీ భరోసా అనుమానంగా ఉంది. 

అర్హులైన ఒక్క రైతు కూడా భరోసా వెలుపల ఉండకూడదని, వివిధ స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేశామని, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారని సర్కారు చెబుతున్నప్పటికీ ఆశించిన మేరకు పురోగతి లేదు. 

రైతులు భరోసా కోసం వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంక్‌, గ్రామ సచివాలయాలు, ఇ-సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారి సమస్యలు పరిష్కారం కావట్లేదు. భరోసాను అక్టోబర్‌ 15న ప్రారంభిస్తామని చాలా ముందుగానే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ యంత్రాంగాన్ని అందుకుతగ్గట్టు సిద్ధం చేయలేదన్న విమర్శలొస్తున్నాయి. భరోసా రాని వారు అర్జీలు పెట్టుకునేందుకు ఇంకా తొమ్మిది రోజులే సమయం ఉండటంతో రైతుల్లో ఆందోళన అధికమైంది.

సొంత భూమి కలిగిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్టుబడి సాయం కింద రూ.13,500 ఏడాదిలో మూడు కిస్తుల్లో ఇస్తున్నాయి. పిఎం కిసాన్‌ నిబంధనలే భరోసాకు వర్తింపజేశారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా సొంత భూమి కలిగిన వారందరూ అర్హులు. రైతులు తమ భూమికి సంబంధించిన ఏదొక హక్కు పత్రం చూపించాలి. ప్రధానంగా వెబ్‌ల్యాండ్‌ ఖాతా, ప్రజాసాధికార సర్వేలను కొలబద్దలుగా తీసుకున్నారు. ఈ రెండింటితో సొంత భూమి కలిగిన రైతులను కుటుంబాల వారీగా వర్గీకరించారు. 

వెబ్‌లాండ్‌ ఖాతాకు ఆధార్‌, మొబైల్‌ అనుసంధానం కాకపోయినా, ఏదేని తప్పులు దొర్లినా తిరస్కారానికి గురవుతున్నాయి. ఎలాగొలా అక్కడ బయటపడినా రైతుల బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌, మొబైల్‌ అనుసంధానం కాకపోయినా తిరస్కారమే! మొబైల్‌కు సొమ్ము జమ అయిందనే 'ఎస్‌ఎంఎస్‌' రాని రైతులకు జవాబు చెప్పే అధికారుల్లేరు. ఫిర్యాదు పరిష్కార కేంద్రాల్లో అర్జీలు తీసుకున్నా త్వరగా పరిష్కరించట్లేదు. వివిధ శాఖలతో ముడిపడి ఉండటంతో రైతుల పరిస్థితి ఎక్కే గడప దిగే గడపలా తయారైంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం నవంబర్‌ 1 నాటికి ఇంకా 39 లక్షల రైతు ఖాతాలు వివిధ దశల్లో పెండింగ్‌లోనో, తిరస్కారానికి గురయ్యో ఉన్నాయి. మొత్తం 79.61 లక్షల ఖాతాల్లో వ్యవసాయశాఖ 53.72 లక్షలను క్లియర్‌ చేసింది. తదుపరి నిర్వహించిన తనిఖీల అనంతరం 42.25 లక్షల ఖాతాలను బ్యాంకులకు పంపగా 39.36 లక్షల ఖాతాల్లో సొమ్ము జమ అయింది.