యువతకు స్ఫూర్తి చంద్రయాన్ 2   

యువతకు స్ఫూర్తి చంద్రయాన్ 2 అని, సైన్స్‌పట్ల వారిలో ఆసక్తి రేపడంలో అది విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ దేశంలోని శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయాలపట్ల హర్షం వ్యక్తం చేశారు. 

సైన్స్, టెక్నాలజీ లేకపోతే ప్రపంచంలోని ఏ దేశం కూడా అభివృద్ధి చెందదని చెప్పారు. సైన్స్ పరిశోధనల నుంచి తక్షణ ఫలితాలను ఆశించకూడదని, ప్రస్తుత తరానికి తక్షణ సహాయంగా ఉండకపోయినా భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నూడుల్స్ తయారు చేయడమో లేక పిజ్జాను కొనుగోలు చేసినంత సులువుగా సైన్స్ పరిశోధనలు ఉండవని, ఎంతో ఓర్పు అవసరమని తెలిపారు. అలాంటి పరిశోధనల ఫలితాలు ఏండ్ల నాటి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతాయి అని మోదీ చెప్పారు. 

చంద్రయాన్ 2 ప్రయోగం గురించి ప్రస్తావిస్తూ.. చంద్రయాన్ 2 (మిషన్ టు మూన్) కోసం మన శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతిదీ (చంద్రుడిపై విక్రమ్ లాండర్ మృదువుగా దిగడం) జరుగకపోయినా మిషన్ విజయవంతమైంది. దీన్ని విస్తృత కోణంలో చూస్తే భారత సైన్స్ ప్రయోగాల జాబితాలో ఇది ఎంతో ప్రధానమైనదిగా కనిపిస్తుంది అని మోదీ తెలిపారు. సైన్స్‌లో ఎలాంటి వైఫల్యాలుండవని.. ప్రయత్నాలు, విజయాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. 

దీన్ని అర్థం చేసుకుంటే సైన్స్‌లో లేదా మీ జీవిత గమనంలో ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. ఆవిష్కరణకు అవసరం తల్లిలాంటిదని గతంలో నమ్మేవారని, ప్రస్తుత ఆవిష్కరణలు అవసరాల పరిధులను దాటిపోయాయని మోదీ గుర్తు చేశారు. పరిశోధకులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని, రానున్న తరాలకు ఉపయోగపడే ప్రయోగాలు చేయాలని పిలుపునిచ్చారు. మన దేశం ప్రపంచానికి చాలా గొప్ప శాస్త్రవేత్తలను అందించిందని సంతోషం వ్యక్తం చేశారు.