ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన బిజెపి ఎంపీ సంజయ్‌

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇటీవల తనపై పోలీసులు దాడికి దిగారని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీలో మీడియా మాట్లాడుతూ.. తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని సంజయ్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజల బ్రతుకులు కుక్కలకన్న హీనంగా తయారైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

సోమవారం హత్యకు గురైన తహశీల్దార్‌ విజయరెడ్డి మృతిపై కేసీఆర్ కసాయి ప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, కొండగట్టు మరణాలపై స్పందించని కేసీఆర్ తన ఫామ్ హౌస్లో కుక్క చనిపోతే మాత్రం స్పందించారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ, రైతుల మధ్య విద్వేషాలు పెంచి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. 

‘ఆర్టీసీ ప్రైవేటికరణపై కేసీఆర్‌కి ఎందుకంత ఆతృత. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కాదు కేసీఆర్ చేసిన హత్యలుగా భావిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామంటూ ఉద్యమసమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదు' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  కేసీఆర్ కి వ్యతిరేకంగా మలిదశ ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. హుజూర్ నగర్ లో డబ్బులను ఏరులైపారించి టీఆర్‌ఎస్ గెలిచిందని చెప్పారు.