గాంధీభవన్ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం  

గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం దూషించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు విహెచ్, షబ్బీర్ అలీలు పరస్పరం దూషించుకోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. 

ఆజాద్‌ పర్యటనపై తనకు సమాచారం లేదని వీహెచ్‌ తొలుత ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనికి బదులుగా ఆయన (వీహెచ్‌) గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ షబ్బీర్‌ అలీ ఘాటుగా స్పందించారు. దీంతో ఇద్దరి నేతల మధ్య మాటాల యుద్ధం చెలరేగింది. వారిద్దరికి సర్ధి చెప్పేందుకు ఆజాద్‌ ప్రయత్నించిన ఫలితం లేకపోయింది.  

పార్టీలో సీనియర్ నేతలకు న్యాయం జరగడం లేదని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికే కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విహెచ్ సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారు. ఆజాద్ జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిపించారు. ఇదిలా ఉండగా విహెచ్ పై వ్యాఖ్యలు చేసే అవసరం తనకు లేదని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా, టీపీసీపీ పదవి కోసం ఆజాద్‌ వద్ద పోటాపోటీ నినాదాలకు దిగారు. గాంధీభవన్‌ ఎదుట ఎంపీ కోమటిరెడ్డి అనుచరుల ఆందోళనకు దిగారు. కోమటిరెడ్డికి పీసీసీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పుడున్న పరిస్థితిలో పీసీసీ అడుగుతున్నా.. గతంలోనూ అడిగా, ఇవ్వలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుంటానని కోమటిరెడ్డి అన్నారు.