రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం  

ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందని మండిపడ్డారు. 

‘ఇది రాచరిక జమానా కాదు.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ఐదు నెలలుగా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచారు. సామాజికవర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు' అని విమర్శించారు. కేంద్రం అన్నీ గమనిస్తోందని, కళ్లు మూసుకుని లేదని మాజీ కేంద్ర మంత్రి హెచ్చరించారు. 

ఇసుక ద్వారా కేవలం రూ.300కోట్ల వరకే ఆదాయం, అంతకు మించి రాదు. ఇసుక కొరత, వరదల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సుజనా విమర్శలు గుప్పించారు.  వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని స్పష్టం చేశారు. 

‘ఏపీలో బీజేపీకి వైసీపీ, టీడీపీ ప్రత్యర్థులే. పీపీఏలపై ఏపీ ప్రభుత్వం చేసేదేం లేదు. రివర్స్‌ టెండరింగ్‌ చేశారు కానీ... పోలవరం అథారిటీ అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్‌లాంటి వారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే తప్ప.. సమస్య పరిష్కారానికి చొరవ చూపడంలేదు’ అని సుజనాచౌదరి విమర్శించారు. 

అమరావతి నోటిఫికేషన్‌ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు విఫలమయ్యారు. నోటిఫికేషన్‌ రానందు వల్లే మ్యాప్‌లో అమరావతి లేదు అని టీడీపీ, వైసీపీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తప్పుల వల్లే వైసీపీకి అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు.