మీడియా గొంతునొక్కకండి జగన్  

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా గొంతు నొక్కేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దేశంలోని వార్తాపత్రికలన్నిటికీ ప్రాతినిధ్యం వహించే ఏకైక అతిపెద్ద సంస్థ ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

తాము అభ్యంతరకరంగా భావించిన వార్తలను ప్రచురించిన మీడియాపై కేసులు దాఖలు చేసేందుకు వివిధ శాఖల కార్యదర్శులకు అధికారం కల్పించే వివాదాస్పద జీవో 2430 జారీ చేయడం పట్ల ఐఎన్‌ఎస్‌ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 తప్పుడు లేదా పరువుకు నష్టం కలిగించే వార్తల విషయంలో పరిష్కారాన్ని కోరడం ప్రభుత్వహక్కు అయినప్పటికీ, అధికారులకు విశృంఖల అధికారాలు ఇవ్వడం మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఎన్‌ఎస్‌ తరఫున సెక్రటరీ జనరల్‌ మేరీ పాల్‌ అభిప్రాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని, పత్రికల హక్కులను కాలరాయకుండా చూడాలని, మీడియా స్వేచ్చగా విధులు నెరవేర్చే వాతావరణాన్ని కల్పించాలని జగన్‌ సర్కారుకు హితవు చెప్పారు.

ఇలా ఉండగా, భారత్ ప్రెస్ కౌన్సిల్ జగన్ ప్రభుత్వ జిఓను గత వారం సుమోటోగా స్వీకరించి అక్టోబర్ 30న జారీచేసిన ఈ ఉత్తరువు పట్ల ఆందోళన  వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సమాచార పౌరసంబంధాల ప్రిన్సిపాల్ కార్యదర్శిని ఆదేశించింది. 

పాత్రికేయులను బెదిరించే విధంగా ఉండే ఇటువంటి ఉత్తరువులు వారిని నైతికతను దెబ్బతీయడంతో పాటు పత్రికా స్వాతంత్రానికి భంగం కలిగిస్తుందని కౌన్సిల్ చైర్మన్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వం ఈ జిఓ ద్వారా చేయాలి అనుకొంటున్న పనులను ప్రెస్ కౌన్సిల్ చేయగలదని స్పష్టం చేశారు.