రెవెన్యూ సమస్యలపై సీఎం దృష్టిపెట్టకే

రాష్ట్రంలో రెవిన్యూ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టకపోవడం వల్లనే అబ్దుల్లాపూర్ ఘటన జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజన జరిగి మూడేళ్లు దాటినా ఆయా కార్యాలయాల్లో వౌలిక వసతులు కూడా సమకూర్చలేదని, తగినంత మంది సిబ్బంది లేకపోవడం, అనేక కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగడం , తహసీల్దార్లు బదిలీలు, పదోన్నతులు లేకపోవడం వంటి అనేక సమస్యలున్నాయని తెలిపారు. 

అయినా రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదని, లక్షలాది మంది రైతులకు ఇంకా పాస్‌పుస్తకాలు అందకపోవడం, భూ సర్వేలు, రికార్డులు సరిచేయడం కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు.  ముఖ్యమంత్రి ఆరు నెలలకోమారు ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి మాట్లాడటమే తప్ప చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దయ్యబట్టారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం రెవిన్యూ వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారించాలని, కార్యాలయాల్లో తగినంత సిబ్బందిని పెంచాలని, నూతన భవనాలు తక్షణమే నిర్మించాలని, అధికారులు, సిబ్బంది బదిలీలు, ప్రమోషన్ల విషయంలో రాజకీయాలు ఒత్తిళ్లకు చోటివ్వకుండా పారదర్శకంగా వ్యవహరించాలని లక్ష్మణ్ హితవు చెప్పారు.  ప్రభుత్వ ఉద్యోగ భద్రత విషయంలో శ్రద్ధ వహించాలని, చనిపోయిన తహసీల్దార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన కోరారు.