ఓటమి భయంతో `స్థానిక' ఎన్నికలకు జగన్ వెనుకడుగు 

ఓటమి భయంతోనే ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదని ఏపీ బీజేపీ నేత, సినీనటి కవిత ఆరోపించారు. 151 అసెంబ్లీ సీట్లు గెలిచామని విర్రవీగుతున్న వైసీపీకి ధైర్యముంటే వెంటనే మున్సిపల్, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. 

పంచాయతీల్లో కార్యవర్గాలు లేక కేంద్రం నుండి రావల్సిన వేల కోట్ల రూపాయిల నిధులు ఆగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలకు కనీస అవసరాలు అదండం లేదనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే జగన్ అసలు బలం ఏమిటో తేలిపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. 

ప్రభుత్వ చేతకానితనం వల్ల 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని ఆమె చెప్పారు. ఉపాధి లేక ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని , అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులవి ఆత్మహత్యలు కావని, అవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని ఆమె స్పష్టం చేశారు. 

ప్రభుత్వం చేతకానితనం వల్లనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ఆమె ధ్వజమెత్తారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వౌనంగా ఉండటం దారుణమని దయ్యబట్టారు. ఇసుక కొరతతో ఐదు నెలలుగా పనికోల్పోయిన ఒక్కో కార్మికుడికి నెలకు రూ  10వేలు చొప్పున చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.