‘పప్పు వర్మ’   బయోపిక్‌తో  ఆర్జీవీ బండారం 

వివాదాలు సృష్టించి నెగిటివ్ పబ్లిసిటీతో తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట అయిన రాంగోపాల్ వర్మ తనపై ఇచ్చిన ట్విట్ల పట్ల ప్రముఖ  గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్మ చేసిన ట్వీట్స్‌పై స్పందించిన జొన్నవిత్తుల ‘పప్పు వర్మ’ అంటూ తానూ ఓ సినిమా తీస్తానని, అది వర్మ బయోపిక్ అని ప్రకటించారు. 

‘‘పప్పు వర్మ అనే సినిమా తీయబోతున్నాను. వాస్తవానికి నాకు, వర్మకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన తీస్తున్న సినిమాపై ఓ చర్చా కార్యక్రమానికి నన్ను పిలిచారు. ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు గురించి అసభ్యంగా చూపించడంతో దాని గురించి మాట్లాడాలని నేను ఆ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. తర్వాత నాపై వర్మ ‘జొన్నవిత్తుల చౌదరి’ అంటూ సెటైర్ వేశాడు" అని తెలిపారు. 

రీసెంట్‌గా ఓ ఛానెల్‌లో కూడా తన గురించి ఏవేవో మాట్లాడాడని, చాలా దారుణంగా మాట్లాడాడని చెబుతూ "నేను నా ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటే, కెలికి మరీ నాపై వర్మ సెటైర్లు వేయడం ఏంటి? నేను లేకుండా ఏదో ఒక ఛానెల్‌లో నాపై లేనిపోని మాటలు మాట్లాడుతుంటే.. నేను మాట్లాడాల్సి వస్తుంది" అని చెప్పారు. 

"నువ్వు పప్పువి.. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావు. నీకంటే అంతర్జాతీయ పప్పు ఎవడూ ఉండడు. అందుకే పప్పు వర్మ అనే సినిమాతో నేనూ నీపై సెటైరికల్‌గా సినిమా చేయగలను. ఎవరిపై పడితే వారిపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. నీ బతుకేంటో నువ్వు చూసుకో అని చెప్పా" అని జొన్నవిత్తుల ప్రకటించారు. 

ఒక ఛానల్ లో చాగంటి కోటేశ్వరావు గురించి అమర్యాదగా మాట్లాడిన వర్మపై జొన్నవిత్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అనుసరించే వారు కొన్ని కోట్ల మంది ఉన్నారని చెప్పారు. "ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. ‘పప్పు వర్మ తన తప్పు తెలుసుకుని, కాకినాడ వెళ్లి ఆయన కాళ్లమీద పడాలి. లేదా కటకటాలలోకి వెళ్లాలి. ఇది నిశ్చియం. స్పష్టంగా చెబుతున్నా" అని స్పష్టం చేశారు. 

"వెంటనే నీ తప్పును సరిదిద్దుకుని, కాకినాడ వెళ్లి ఆయన కాళ్లమీద పడు. నువ్వు ఎవర్నీ అన్నావో ఆయన కాళ్లమీద పడాలి. లేదా నిన్ను చట్టబద్దంగా ఏం చేయాలో.. అదే చేస్తా..’’ అని వర్మను హెచ్చరించారు.