జగన్ కు గుదిబండ కానున్న 'స్టార్టప్‌' రద్దు

రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ఒప్పందాన్ని రద్దు చేశామంటూ  జగన్ ప్రభుత్వం ప్రకటించినా ఈ విషయమై ఇంకా అధికార వర్గాలలో స్పష్టత కానరావడం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా మని, దానికి సింగపూర్‌ కన్సార్టియం కూడా అంగీకరించిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారా యణ చెప్పినప్పటికీ ఆ ప్రక్రియ అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా, ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వనాయికి గుదిబండగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఒప్పందం రద్దుకు పరిహారంగా ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని సిఆర్‌డిఎ చెబుతుండగా, సింగపూర్‌ కన్సార్టియం రూ 71 కోట్లు తమకు రావాల్సి ఉంటుందని వాదిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంపై కూడా రానున్న రోజుల్లో పేచీ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఎందు కివ్వాలి, ఎలా ఇస్తారనే అంశంపై అధికారయం త్రాంగంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

నిజానికి గత ప్రభుత్వం కుదుర్చుకున్న స్టార్టప్‌ ఏరియా ఒప్పందంలో కీలక అంశాలపై ఎవరికీ స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ఒప్పందం కొనసాగినా ఎంత లాభాలొస్తాయన్నది చెప్పలేకపోతు న్నారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రాజెక్టు రద్దయితే, ఎటువంటి పరిహారాలు ఇవ్వాలన్న అంశం కూడా అప్పట్లో కీలక పాత్ర పోషించిన అతి కొద్దిమంది అధికారులకే తెలుసని అంటున్నారు. 

ప్రభుత్వం మారిన తరువాత అధికారులను భారీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఒప్పందాన్ని, అందులోని క్లాజులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసే పనిలో ప్రస్తుత అధికారులు ఉన్నారు. ఒప్పందాలన్నీ ప్రభుత్వంతో నేరుగా కుదుర్చుకున్నవే కావడంతో రద్దు కూడా ప్రభుత్వమే చేయాల్సి ఉంటుందని, ఈ మేరకు మంత్రిమండలి తీర్మానం తప్పనిసరి అని చెబుతున్నారు. 

ఆ తీర్మాన ప్రతిని సిఆర్‌డిఎకు పంపితే అక్కడి నుండి కన్సార్టియంకు చేరుతుందని, దానిని కన్సార్టియం పరిశీలించి తన అభిప్రాయాన్ని చెబితేనే పరస్పర అంగీకారంతో రద్దు అవుతుందని అంటున్నారు. పరిహారం విషయంలో కూడా స్పష్టత లేదని, ఒక వేళ రద్దు చేయాల్సివస్తే అప్పటివరకు జరిగిన పనుల ఆధారాంగా కన్సార్టియమే ఇంత పరిహారం కావాలని ప్రతిపాదించే అవకాశం ఒప్పందంలో ఉందని చెబుతున్నారు. 

ఈ నిబంధన ప్రభుత్వానికి గుది బండగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2017 మే 17న విజయవాడలోని హోటల్‌ గేట్‌వేలో స్విస్‌ఛాలెంజ్‌పై ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పూర్తయితే కన్సార్టియంకు రూ.3086 కోట్లు లాభం వస్తుందని ఆ సందర్భంగా సిఆర్‌డిఎ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు రద్దయితే అంత మొత్తాన్ని తాము కోల్పోతామని, రెండేళ్లపాటు తాము ప్రాజెక్టు చుట్టూ తిరిగామని కన్సార్టియం ఇటీవల సిఆర్‌డిఎ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది.