తిరువళ్లువర్  విగ్రహానికి అవమానం 

ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అవమానపరిచారు. తమిళనాడు తంజావూర్ జిల్లాలోని పిల్లయారిపట్టిలో ఉన్న తిరువళ్లువర్ విగ్రహం ముఖానికి దుండగులు ఆవు పేడను రుద్ది సిరా చల్లారు. 

ఈ ఘటనకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తంజావూర్ జిల్లాలోని దాదాపు 50 కాలేజీల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమిళ యూనివర్శిటీలో విద్యార్థులు ధర్నాకు దిగారు. బీజేపీ కార్యకర్తలు తిరువళ్లువర్ విగ్రహాన్ని శుభ్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

థాయ్ భాషలో ముద్రించిన తిరుక్కురల్ పుస్తకాన్ని శుక్రవారం బ్యాంకాక్‌లో ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేసిన నేపథ్యంలో కాషాయం రంగు శాలువా కప్పుకొని నుదుట విభూతితో ఉన్న తిరువళ్లువర్ ఫొటోను తమిళనాడు బీజేపీ శాఖ నేతలు ట్విట్టర్‌లో పోస్టుచేశారు. 

తిరువళ్లువర్‌ను బీజేపీ తమ రాజకీయాలకు వాడుకుంటున్నదంటూ డీఎంకే నేతలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో తాజా ఘటన జరిగింది.