శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి.. ఒకరు మృతి, 35 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి జరిగింది. సోమవారం రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. మధ్యాహ్నం 1.20కి హరిసింగ్ వీధిలోని ప్రధాన మార్గంలో ఉన్న మార్కెట్‌లో ముష్కరులు గ్రెనేడ్ పేల్చారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 35 మంది గాయపడ్డారు. మృతుడ్ని షహ్రాన్‌పూర్‌కు చెందిన రింకూ సింగ్(40)గా గుర్తించారు. 

మరోవైపు శీతాకాలం ప్రారంభం కావడంతో జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని పాలనా యంత్రాంగం వేసవి రాజధాని శ్రీనగర్ నుంచి శీతాకాల రాజధాని జమ్ముకు బదిలీ అవుతున్నది. ఈ తరుణంలో తాజాగా గ్రెనేడ్ దాడి జరుగడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

జమ్ముకశ్మీర్‌లో సోమవారం నాటికి సరిగ్గా మూడు నెలలుగా సాధారణ జనజీవనం స్తంభించింది. పలు చోట్ల ఆంక్షలు ఎత్తివేసినా రోడ్లపై రద్దీ తక్కువగానే ఉన్నది. దుకాణాలు, వ్యాపార సంస్థలు సోమవారం ఉదయం తెరుచుకున్నప్పటికీ కొనుగోలుదారులు లేక మధ్యాహ్నానికి మూతపడ్డాయి. ప్రజారవాణా ఇంకా గాడిలో పడలేదు. పాలనా యంత్రాంగం శ్రీనగర్ నుంచి జమ్ముకు తరలుతున్న నేపథ్యంలో ప్రైవేటు వాహనాలు సాధారణం కన్నా తక్కువగా కనిపించాయి. 

మరోవైపు పాఠశాలలను తెరిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు వారిని స్కూళ్లకు పంపడంలేదు. అయితే 10, 12వ తరగతి పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని అధికారులు తెలిపారు. ల్యాండ్‌లైన్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ ఫోన్ల సేవలను పునరుద్ధరించినా ఇంటర్నెట్ సేవలు మాత్రం ఆగస్టు 5 నుంచి నిలిచిపోయాయి. 

మరోవైపు వేర్పాటువాదులతోపాటు పలువురు రాజకీయ నేతలు కస్టడీలో ఉండగా ముఖ్యనేతలైన మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వంటి వారు గృహ నిర్బంధంలో కొనసాగుతున్నారు.