సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు  

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి  సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఛార్జ్‌ సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఐదు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనుండగా ఈ బదిలీ జరగడం గమనార్హం. 

జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పేరిట ఉత్తర్వులు జారీచేశారు. సీఎస్ బదిలీ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ప్రిన్స్‌పల్ సెక్రటరీ, జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌‌కు ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ అక్టోబర్ 31న జారీ చేశారు. దీనికి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. 

కేబినెట్‌ అజెండాలో పెట్టే అంశాలను సీఎస్ ఆమోదం లేకుండా నేరుగా ఎజెండాలో చేర్చడం ఏపీ బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకమని, విధివిధానాలు పాటించలేదని.. పైగా సీఎస్ ఆమోదం లేకుండా ఎలా చేస్తారని ఎల్వీ ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ విషయం సీఎం జగన్‌కు తెలియకుండానే ఎల్వీ.. ప్రవీణ్‌ ప్రకాష్‌‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.   

కాగా, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు బాధ్యత లేని విపరీత అధికారాలు చెలాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో పాలనకు ఇది శాపమన్నారు. సీఎం ఆఫీస్ అధికారులు ఇష్టానుసారం చెలరేగడం చంద్రబాబు హయాంలో మొదలైందని చెప్పారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోందని ఆయన తెలిపారు.