వైసీపీలో కలకలం రేపుతున్న ‘జనసేన లాంగ్ మార్చ్ ’  

గత అసెంబ్లీ ఎన్నికలలో సొంతంగా పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా ఓటమి చెందటంతో పాటు పార్టీ నుండి కేవలం ఒకరు మాత్రమే ఎన్నిక కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్ర సమాప్తమైన్నట్లే అని చాలామంది నిర్ధారణకు వచ్చారు. ఎన్నికల అనంతరం ఏదో ఒక కార్యక్రమంతో రాజకీయ ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. పైగా, తిరిగి పవన్ సినిమాల వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుకు విధానంతో రోడ్లపాలై, ఆత్మహతలకు సహితం పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా ఆయన ఆదివారం విశాఖపట్నంలో జరిపిన `లాంగ్ మార్చ్', బహిరంగ సభ అధికారమలో ఉన్న వైసిపి ప్రభుత్వంలో కలకలం రేపుతున్నట్లు కనిపిస్తున్నది. పలువురు మంత్రులు, ఆ పార్టీ నాయకులు తీవ్ర పదజాలంతో పవన్ పై విమర్శలకు దిగడమే వారిలో నెలకొన్న భయాందోళనలను వెల్లడి చేస్తున్నాయి. 

వైసిపికి ఇప్పుడు 151 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. జనసేనకు ఉన్నది ఒక్కరు మాత్రమే. దానితో రాజకీయంగా ఆ పార్టీ నుండి ఎటువంటి ప్రమాదం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. 23 మంది ఎమ్యెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి సహితం పత్రికా సమావేశాలకు, హాలు సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారమలోకి వచ్చాక ఐదు నెలల తర్వాత ఆయన ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతూ పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ జరపడంతో అధికార పక్షంలో అభద్రతా భావం నెలకొంటున్నట్లు కనిపిస్తున్నది. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి, బిజెపి, వామపక్షాలు పలు ఆందోళనలు చేబడుతున్నా అవి చాలావరకు వారి వారి పార్టీల కార్యకర్తలు, మద్దతు దారులకు పరిమితం అవుతున్నాయి. అంచనాలకు మించి విశాఖ బహిరంగసభకు జనం రావడం రాజకీయ వర్గాలలకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. అంతమంది జనం వస్తారని ఊహించలేని పోలీసులు తగు రీతిలో భద్రతా ఏర్పాటు చేసిన్నట్లు కనబడటం లేదు. చివరకు జనసేన నేతలు సహితం అంతటి స్పందనను ఊహించలేదని చెబుతున్నారు. 

వ్యూహాత్మకంగా ఈ సభను ప్రభుత్వ వ్యతిరేక సభగా మార్చడం కోసం ప్రతిపక్షాల నేతలు అందరికి ఫోన్లు చేసి పవన్ స్వయంగా ఆహ్వానించారు. టిడిపి నుండి ఇద్దరు మాజీ మంత్రులు పాల్గొనగా, బిజెపి సంఘీభావం ప్రకటించింది. బిజెపిని ఆహ్వానించారని సాకుతో ఇప్పటి వరకు పవన్ తో కలసి ప్రయాణం చేస్తున్న వామపక్షాలు దూరంగా జరిగాయి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సిపిఎం అధికార పక్షంకు దగ్గర అవుతూ ఉండటం అందరు గమనిస్తున్నారు. 

అధికార పక్షానికి ప్రత్యేకంగా కలవరం కలిగిస్తున్న అంశం ఈ సభ రాష్ట్రంలో తమకు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణకు మార్గం ఏర్పడే సంకేతాలు వెలువడటమే అని తెలుస్తున్నది. బిజెపి, తెలుగుదేశం పార్టీలు పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన వెంటనే స్పందించడంతో రాజకీయ పునరేకీకరణపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

ఈ మూడు పార్టీలు ఇప్పుడే రాజకీయ పొత్తులకు సిద్దపడక పోయినా రాబోయే రోజులలో ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటాలు జరిపితే ప్రభుత్వం ఇరకారంలో పడక తప్పదని ఆందోళన చెందుతున్నారు. తనను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పిస్తున్న టిడిపిని ఆహ్వానించడం, భవన నిర్మాణ కార్మికుల సంఘాలున్న వామపక్షాలు దూరంగా జరగడం గమనిస్తే నూతన రాజకీయ సమీకరణలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 

రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాడదామని సంకేతాలు ఇవ్వడం ద్వారా రాజకీయంగా తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేయడమే కాకుండా ప్రతిపక్షాల మధ్య వారధిగా తనను తాను మలచుకొని ప్రయత్నం పవన్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదిఏమైనా, ప్రభుత్వపరంగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా లాంగ్ మార్చ్ విజయవంతం కావడం మాత్రం  జగన్ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు.