బీజేపీలో చేరిన మాజీ టిడిపి నేత మోత్కుపల్లి  

టీడీపీలో ఫైర్‌బాండ్‌గా ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నేడు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. మోత్కుపల్లికి కండువాకప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

అంతకు ముందు మోత్కుపల్లి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి…రాష్ట్రంలోని పరిస్థితులను తెలిపారు. అమిత్ షాను మోత్కుపల్లితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్ రావు, వీరేందర్ గౌడ్ కలిశారు.

తెలంగాణలో టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఒకానొక సమయంలో సంచలన ప్రకటన చేశారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం  జోరుగా సాగింది. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో బీఎల్‌ఎఫ్‌ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలు ఆయన ఇంటికి వెళ్లి.. బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. 

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అసంతృప్తి నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. మోత్కుపల్లి కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఓ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం.. తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం కావాలని బిజెపి ప్రయత్నిస్తుండటం తెలిసిందే.