తన మాటలు వక్రీకరించారన్న యడియూరప్ప

రెబెల్ ఎమ్మెల్యేలపై తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ సమయంలో తాను రెబెల్ ఎమ్మెల్యేలను ముంబయి తరలించినట్లుగా మాట్లాడినటు లీకేజీ వీడియోలో వెల్లడి కావడంతో యడియూరప్ప ఈ ప్రకటన చేశారు. 

యడియూరప్ప వ్యాఖ్యలు ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించిందన్న విషయాన్ని అంగీకరించడమేనని ఈ వీడియో ఆధారంగా ధ్వజమెత్తుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ అంశాన్ని సోమవారం సుప్రీం కోర్టులో కూడా ప్రస్తావిస్తామని తెలిపింది. 

కాగా రాజీనామా చేసిన అనర్హ ఎమ్మెల్యేల నిర్ణయం వారి సొంతమని దానితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని యడియూరప్ప స్పష్టం చేశారు. అయితే తదుపరి ఏ చర్య తీసుకోవాలన్న దానిపై పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని, దీనిపై తమ పార్టీ జాతీయ అధ్యక్షునిదే తుది నిర్ణయం అని మాత్రమే తాను ఆ వీడియోలో అన్నానని, అంతకు మించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. 

రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తామని తాను ఎప్పుడూ చెప్పలేదని, అయితే సుప్రీంకోర్టులో గందరగోళం సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి అర్థం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం మూర్ఖత్వం అని యడియూరప్ప పేర్కొన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.