బీజేపీ సోషల్ మీడియాలో ఏపీ టాప్

భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాల్లో ఆంధ్రప్రదేశ్ శాఖ ముందంజలో ఉందని మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు విజయ రాహత్కర్ ప్రశంసించారు. ఆదివారం వివిధ రాష్ట్రాల సోషల్ మీడియా కన్వీనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ కన్వీనర్ బొల్లాప్రగడ శ్రీదేవిని ఈమేరకు ఆమె అభినందించారు. 

ఈసందర్భంగా శ్రీదేవి విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని శక్తిమంతంగా మార్చే క్రమంలో తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు, అభివృద్ధి దిశగా భారత్‌ను తీర్చిదిద్దుతున్న పాలనా విధానాలు సోషల్ మీడియాలో మరింతగా విస్తృత ప్రచారం కావాల్సి ఉందని చెప్పారు. జిల్లాల్లో మహిళా మోర్చా రీట్వీట్లు, లైక్‌లు, షేర్లు విషయంలో వెనుకబడుతున్నాయని చెప్పారు.

పార్టీకి సంబంధించి ఏది షేర్ చేసినా రాష్ట్రానికి మంచిపేరు వస్తుందని పేర్కొన్నారు. యువత సామాజిక మాధ్యమాల ద్వారానే అనేక విషయాలను ఆకళింపు చేసుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ఇందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌ను తప్పక వినియోగించాలని సూచించారు. 

ప్రధాని మోదీ జాతీయ, అంతర్జాతీయ విధివిధానాలను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. భారత్‌తో పాటు బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీలో ఏపీ విభాగానికి గుర్తింపు ఇచ్చినందుకు విజయ రాహత్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.రానున్న కాలంలో పార్టీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై విస్తృత ప్రచారం చేస్తామని ఆమె వివరించారు.