2024లో ఏపీలో అధికారం బీజేపీదే

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కడపలో జరిగిన బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ 2024లో రాష్ట్రంలో బిజెపి అధికారమలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశలో పయనిస్తున్నందున పలువురు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. 

రాష్ట్రంలో కూడా అనేకమంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికుల ఇక్కట్లను గుర్తించి, ఆందోళనలు మొదలుపెట్టింది బీజేపీనే అని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారమైందన్న విషయంపై సీఎం జగన్‌కు లేఖ రాయడంతో పాటు గవర్నర్‌ను కలిసి స్వయంగా సమస్యను వివరించామని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలను లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో బీజేపీ ముందుండి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ విజయవాడలో కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా నాయకత్వంలో బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి జిల్లాలోని బూత్ కమిటీ సభ్యులంతా హాజరుకావాలని సూచించారు.

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమంగా సంపాదించిన ప్రతి పైసా కక్కాల్సిందేనని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి, బీజేపీ నిరాడంబరం నచ్చి పలువురు పార్టీలో చేరారని చెబుతూ జగన్ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారని, తనపై ఉన్న కేసుల్లో జైలుకు పోతాననే భయం అతడిని వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. 

బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని, కేంద్రం అమలు చేసే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని తెలిపారు. పేదలు, రైతుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెబుతూ రాష్ట్రానికి కూడా బీజేపీ తక్కువేమీ చేయలేదని, అన్ని రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రానికి నిధులు ఇస్తున్నదని చెప్పారు. 

సీఎం జగన్ మాత్రం ప్రధాని మోదీ ఏమీ ఇవ్వలేదన్నట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కోర్టు పరిధిలో అందరూ సమానమేనని, ఏ స్థాయి వ్యక్తి అయినా కోర్టుకు హాజరుకావాల్సిందే స్పష్టం చేశారు.