ఆర్‌సీఈపీ ఒప్పందం ఖరారు అనుమానమే

ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్న ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందం ఈసారి కూడా ఖరారయ్యే సూచనలు కనిపించడం లేదు. చైనా నుంచి దిగుమతులు పోటెత్తుతాయన్న ఆందోళనల నేపథ్యంలో దేశీయ పరిశ్రమల రక్షణకు భారత్‌ చివరి నిమిషంలో కొత్త డిమాండ్లను తెరపైకి తేవడంతో ఈ ఒప్పందం 2020కి వాయిదా పడే అవకాశముందని ఆగ్నేయాసియా నేతలు ఆదివారం ముసాయిదా ప్రకటనలో పేర్కొన్నారు.

16 ఆసియా, పసిఫిక్‌ దేశాలతో ఆర్‌సీఈపీ కూటమి ఏర్పాటవుతున్నది. ఇది ప్రపంచ జీడీపీలో 30 శాతం, ప్రపంచ జనాభాలో సగభాగం కలిగి ఉన్నది. ఆర్‌సీఈపీ ఒప్పందం ఖరారు కాకపోవచ్చని, సంయుక్త ప్రకటన మాత్రమే వెలువడొచ్చని థాయ్‌, సింగపూర్‌, జపనీస్‌ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ‘మార్కెట్‌ యాక్సెస్‌కు సంబంధించిన సంప్రదింపులు చాలా వరకు పూర్తయ్యాయని, పలు ద్వైపాక్షిక సమస్యలు 2020 ఫిబ్రవరి నాటికి పరిష్కారమవుతాయని ‘ఆసియాన్‌' నేతలు ముసాయిదా ప్రకటనలో పేర్కొన్నారు. 

వచ్చే ఏడాది వియత్నాంలో జరిగే ‘ఆసియాన్‌' సదస్సు సందర్భంగా ఆర్‌సీఈపీపై సంతకం చేసేందుకు సభ్య దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. చైనా నుంచి పోటెత్తే చౌక ఉత్పత్తులతో దేశంలోని చిన్న పరిశ్రమలు దెబ్బతింటాయని భారత్‌ ఆందోళన వ్యక్తంచేస్తున్నది. ఆదివారం ఆసియాన్‌ నేతలతో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అన్ని పక్షాలకు అర్థవంతమైన మార్కెట్‌ను కల్పించాలని ప్రధాని పేర్కొన్నట్లు ఒక అధికారి తెలిపారు. 

ఆర్‌సీఈపీని ఆయుధంగా చేసుకుని భారత్‌లోకి చైనా చౌక ఉత్పత్తులను డంప్‌ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్‌లోని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, చిన్న పరిశ్రమలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందలో తగిన రక్షణలు కల్పించాలని భారత్‌ డిమాండ్‌ చేస్తున్నది. 

10 ఆసియాన్‌ దేశాలతోపాటు భారత్‌, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, దక్షిణకొరియా మధ్య ఆర్‌సీఈపీ ఒప్పందానికి సంబంధించి ఏడేండ్లుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆర్‌సీఈపీలో భారత్‌ చేరితే, ఆసియాన్‌, జపాన్‌, దక్షిణకొరియాకు చెందిన 90 శాతానికిపైగా ఉత్పత్తులకు, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన 74 శాతానికిపైగా ఉత్పత్తులకు సుంకాలను తొలిగించాల్సి ఉంటుంది.