భవన నిర్మాణ కార్మికులపై రెండు వారాల అల్టిమేటం  

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇసుక కొరతకు నిరసనగా విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ నసందర్భంగా జరిగిన   బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక్కో కార్మికుడికి రూ.50 వేలు ఇవ్వాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

రెండు వారాల్లో స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా అని ప్రకటించారు. చంద్రబాబు మీద కోపంతో ఇంత మంది ప్రజల్ని శిక్షిస్తారా?. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం వల్ల 26 మంది చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.  కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోతుందని పవన్ హెచ్చరించారు. ఇది కర్మ సిద్ధాంతం కాదు..చర్యకు ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశారు.  

‘‘ఇప్పుడే ఇసుక కొరత ఎందుకు వచ్చింది?. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడే ఇసుక కొరత ఎందుకు ఉంది. కూలీలు ఎందుకు చనిపోతున్నారు?. జీవనాధారం పోయిందని ఆవేదన పడుతూ సెల్ఫీ వీడియోలు తీసి కూలీలు చనిపోతున్నారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా?." అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంతమంది జనం ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేబినెట్‌ మంత్రులకు జీతభత్యాలు తీసుకునే అర్హత లేదని స్పష్టం చేశారు. 

జనం కష్టాలు అర్థంకాని వారికి ప్రజాధనంతో విలాసాలు ఎందుకు?. అని నిలదీశారు. అధికారంలోకి రాగానే రాజధాని కట్టం అని చెప్పారని అంటూ విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. "నా జీవితంలో చాలా చూసి వచ్చా, ఎన్నో దెబ్బలు తిన్నా. సూట్‌కేస్‌ కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లారు. విజయసాయిరెడ్డి విమర్శలకు మేం సమాధానం చెప్పాలా?. విజయసాయిరెడ్డి సమాజసేవ చేసి జైలుకి వెళ్లారా?." అంటూ ఎద్దేవా చేశారు. 

జగన్ సరిగా పాలిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  ఆరునెల లోపుగానే పాలనలో జగన్ విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు. నాయకులు బాధ్యతాయుతంగా పాలిస్తే తాను జనసేన పార్టీని పెట్టేవాడిని కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే  ఇసుక కొరత ఏర్పడిందని ధ్వజమెత్తుతూ ఇవాళ భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రజలు రోడ్లపైకి వస్తే ప్రభుత్వం విఫలమైనట్టేనని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికులను కాపాడుకోలేక పోతే జీవిత రథ చక్రాలు ఆగిపోతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమవరం, గాజువాకలో ఓడినంత మాత్రానా తాము విఫలమైనట్టు కాదని పవన్ స్పష్టం చేసారు.  ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం కంటే పదవులు ఎక్కువ కాదని చెప్పారు. 

తాను టీడీపీకి దత్తత పుత్రుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతూ తాను ప్రజలకు తప్ప ఎవరికీ దత్తత పుత్రుడని కాదని తెలిపారు. జగన్ కు రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడే దమ్ము లేకపోయిందని మండిపడ్డారు. తాను తెలంగాణ నడిబొడ్డున ఉద్యమం గురించి మాట్లాడా కాబట్టే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు తనను నమ్మారన్నారని చెప్పారు. 

సీఎం జగన్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదని పవన్ స్పష్టం చేశారు.  జగన్‌ గొప్ప నాయకుడైతే తన కంటే ఎవరూ ఎక్కువ సంతోషించరని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను పార్టీ పెట్టలేదని తేల్చి చెప్పారు. తమ పాలసీలు సరిగా లేనప్పుడు ఎలా పరిపాలిస్తారని ఆయన జగన్ ను ప్రశ్నించారు. అజయ్‌కల్లామ్‌ లాంటి ఆలోచనపరులు ఉండి కూడా ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. 

వైసీపీలో ఏకస్వామ్యం మాత్రమే ఉందిని, ప్రజాస్వామ్యం లేదని పవన్ విమర్శించారు. ఒకడి ఇష్టానుసారం నడిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వంలో డిబేట్లు లేవని, ఆలోచనలు పంచుకోవడం కూడా లేదని దుయ్యబట్టారు. జగన్ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారని, అందుకే ఇలా జరుగుతుందని పవన్ తెలిపారు.

ప్రజల్ని మీరు ఎలా చూస్తారో.. వాళ్లు మిమ్మల్ని అలానే చూస్తారని హితవు చెప్పారు. 151 సీట్లు వచ్చిన నాయకులు కూడా దీనికి అతీతులు కాదని తేల్చి చెప్పారు.  ప్రతి శుక్రవారం కోర్టులకు వెళ్లే మీరు జనాలను పాలిస్తారా?. అంటూ ఎద్దేవా చేశారు.