ప్రవీణ్‌ ప్రకాశ్‌కు షోకాజ్‌ నోటీసుతో ఝలక్‌!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ‘సీఎం తర్వాత నేనే’ అన్నట్లుగా వరుసగా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న సీఎం ముఖ్య కార్యదర్శి, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేయడం ద్వారా ఝలక్‌ ఇచ్చారు. విధి నిర్వహణలో తన పరిధిని అతిక్రమించినందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రమణ్యం ఈ నోటీసు జారీచేసినట్లు తెలిసింది. 

ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి సీఎస్‌ షోకాజ్‌ నోటీసు ఇవ్వడం బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటీవల గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా చెప్పకుండా... బిజినెస్‌ రూల్స్‌ను సవరిస్తూ ఉత్తర్వులిచ్చేశారు. స్పెషల్‌ సీఎస్‌ స్థాయి అధికారులకు సైతం సీఎం సూచనల మేరకు నోటీసులు ఇచ్చే అధికారాన్ని తనకు దఖలు పరుచుకున్నారు. 

ఈ చర్య సీఎస్‌ ఉనికిని ప్రశ్నించడంతోపాటు, గవర్నర్‌ అధికారాలనూ తోసిరాజనడమే అని... ఇది బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధమని అధికార వర్గాకాలలో పెను దుమారం చెలరేగింది.  సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఈ జీవో పట్ల తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన అధికార పరిధిని ప్రవీణ్‌ ప్రకాశ్‌ కబ్జా చేయడం నిబంధనలకు విరుద్ధమని సహచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు. 

అయితే... ప్రవీణ్‌ ప్రకాశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తుండడంతో ఆయనపై చర్యలు తీసుకోవడం అంత సులువు కాదని అధికారవర్గాల్లో చర్చోపచర్చలు సాగాయి. విషయం ఇంతటితో ఆగలేదని... బిజినెస్‌ రూల్స్‌ను పక్కనపెడుతూ ప్రవీణ్‌ ప్రకాశ్‌ మరికొన్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉప కార్యదర్శుల బదిలీలను తానే చేస్తానంటూ జారీ చేసిన జీవోపైనా విమర్శలు వెల్లువెత్తాయి. 

తాజాగా... కేబినెట్‌కు ఫైల్‌ పంపే విషయంలో కూడా నిబంధనలను పాటించలేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు జలక్‌ ఇస్తూ నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం పేషీ అధికారికే నోటీసు జారీకావడం కలకలం సృష్టించింది. ప్రవీణ్‌ ప్రకాశ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆయన విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.

ఆ సమయంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఒక ప్రిసైడింగ్‌ అధికారిని... ఈసీ అనుమతి లేకుండా ఆయనే బదిలీ చేశారు. దీనిపై ఈసీ అధికారి ఫోన్‌ చేసి ప్రశ్నించగా ప్రవీణ్‌ పరుషంగా మాట్లాడినట్లు తెలిసింది. ఆ అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి విషయం నివేదించారు. సీఈసీ స్పందించి.. ప్రవీణ్‌ ప్రకాశ్‌ను తక్షణం విశాఖపట్నం కలెక్టర్‌ బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించి.. రాష్ట్ర ప్రభుత్వం చేత దాన్ని అమలు చేయించింది.

ఇంతకు ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసు జారీ చేయడంలో ప్రధాన కార్యదర్శి స్వతంత్రంగా వ్యవహరించారా, ముఖ్యమంత్రి ప్రమేయంతోనే చర్యకు పాల్పడ్డారా అన్నది చెలియరావడం లేదు.