స్టాలిన్ కు పట్టాభిషేకం వచ్చే వారమే

సుమారు అర్ధశతాబ్ద కాలం పాటు డీఎంకే అద్యక్షుడిగా కొనసాగిన రాజకీయ కురువృద్దుడు యం కరుణానిధి మృతి చెందడంతో, ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆయన కుమారుడు యం కే స్టాలిన్ ఆ పదవి చేపట్టడానికి రంగం సిద్దమవుతున్నది. వచ్చే వారం, ఈనెల 14వ జరుగనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో స్టాలిన్ ఆ పదవి చేపట్టడం కోసం ముహూర్తం నిర్ణయించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ సైతం 96 ఏళ్ల వృద్ధుడు కావడంతో పార్టీ పగ్గాలను తప్పనిసరిగా కరుణనిధి కుమారుడికే అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పదవిపై కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి సహితం కన్ను వేసినా 2014లో స్వయంగా కరుణానిధి ఆయనను పార్టీ నుండి బహిష్కరించడం, అప్పటి నుండి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఉండడంతో ప్రస్తుతం అవకాశం ఉండదు.

ఇప్పటి వరకు కుటుంభానికి దూరంగా మదురైలో ఉంటున్న అళగిరి కరుణానిధి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి ఇతర కుటుంభ సభ్యులతో కలసి మెలిసి ఉండటం, అంత్యక్రియల సమయంలో సహితం తమ్ముడు స్టాలిన్ తో సన్నిహితంగా వ్యవహరించడం, పైగా ఎక్కువగా మీడియా ముందుకు రాకుండా తండ్రి రాజకీయ వారసుడిగా స్టాలిన్ భావించేటట్లు చేసిన్నట్లు కనబడుతున్నది. చిన్నతనం నుండి స్టాలిన్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటే, ఆళగిరి మాత్రం కొద్దికాలం నుండే క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య ఘర్షణలు నివారించడం కోసం మొదటి నుండి పార్టీపరంగా దక్షిణ తమిళనాడులో అళగిరి, ఉత్తర తమిళనాడులో స్టాలిన్‌ పనిచేసే విధంగా కరుణానిధి ఏర్పాటు చేసారు.

తన కుటుంభ సభ్యులు ఎవ్వరిని తన రాజకీయ వారసులుగా కరుణానిధి ప్రకటించక పోయినప్పటికీ, తన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్‌ను నియమించడం ద్వారా తన రాజకీయవారసుడు ఎవరో అనే విషయమై స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లు అయింది. రుణ. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘నమక్కు నామే’ (మనకు మనమే) పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించి కేడర్‌ను సమాయత్తం చేయడం ద్వారా పార్టీపై స్టాలిన్ పట్టు సంపాదించ గలిగారు.  దీని ఫలితంగా రాష్ట్ర చరిత్రలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎన్నడూ లేని విధంగా 89 స్థానాలు సాధించిపెట్టారు. పార్టీని సమర్థవంతంగా నడిపించగల సత్తా స్టాలిన్‌కే ఉందని కరుణానిధి మెచ్చుకున్నారు.