సమ్మె విరమించేది లేదు..విధుల్లోకి చేరేది లేదు 

ఎల్లుండి (న‌వంబ‌ర్ 5 మంగ‌ళ‌వారం) రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని, డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఈ సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. సిఎం కేసిఆర్‌ శనివారం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో తమ సమస్యల పరిష్కారంపై హామీ రాలేదని పేర్కొన్నారు. సీఎం డెడ్ లైన్లు పెట్టడం కొత్తకాదని, కోర్టులను సైతం సీఎం డిక్టేట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు తీసే అధికారం సీఎంకు లేదని, డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

ఆర్టీసీలో కూడా రిజర్వేషన్లు అమలు ఉన్నాయని, ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్లకు బుగ్గ కారులో తిరగాలని సోకు లేదని, కార్మికుల డిమాండ్ల కోసమే యూనియన్లు పనిచేస్తున్నాయ‌ని వివరించారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కార్మికులు నా బిడ్డలు అనుకుంటూనే కేసీఆర్ వారిని ఇబ్బంది పెడుతున్నార‌ని మండిపడ్డారు. ఎవరో ఇద్దరు ముగ్గురు కార్మికులు భ‌య‌ప‌డి ఉద్యోగంలో చేరుతున్నారు కానీ.. కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు.