బహుముఖ ప్రజ్ఞాశాలి డా సోమరాజు సుశీల 

ప్రముఖ శాస్త్రవేత్త, మహిళా పారిశ్రామిక వేత్త, సామాజిక సేవకురాలు డా. సోమరాజు సుశీల బహుముఖ ప్రజ్ఞాశాలి అని, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం గల ఆమె యువతను, ముఖ్యంగా మహిళలను పారిశ్రామికులుగా మలచడంలో ఎంతో సహకరించేవారని పలువురు కొనియాడారు. గత నెలలో మృతి చెందిన ఆమెకు అంజలి ఘటిస్తూ సోషల్ కాజ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో పలువురు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.  

తొలి మహిళా శాస్త్రవేత్తగా, తొలి మహిళా పారిశ్రామిక వేత్తగా ఆమె యువతను ఎప్పుడు ప్రోత్సహించేవారని, అనేక సామాజిక సేవాకార్యక్రమాలలో శ్రీయాశీలకంగా పాల్గొంటూ పోరాట పటిమను కూడా ప్రదర్శించేవారని అంటూ ఆమెను ఒక `కర్మ యోగి'గా అభివర్ణించారు. 2006 నుండి 2019 వరకు సోషల్ కాజ్ అధ్యక్షురాలిగా దేశ రక్షణ, జాతీయ భద్రత లతో పాటు పలు సామాజిక అంశాలపై హైదరాబాద్ లో అర్ధవంతమైన చర్చలకు వేదిక కల్పించారని గుర్తు చేసుకున్నారు. 

అనేకమంది యువకులు, ముఖ్యంగా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా మారడంలో ఆమె కీలక పాత్ర వహించారని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ మాజీ డైరెక్టర్ సి రాణి తెలిపారు. పైగా, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకొనే విధంగా చేయడంలో కూడా ఆమె విశేషంగా కృషి చేసారని చెప్పారు. 

ఎవ్వరిని కలిసినా వారితో ఆత్మీయమైన అనుభబంధాన్నీ పెంపొందింప చేసుకునేవారని, ఆమెలో విశేషమైన నాయకత్వ లక్షణాలు ఉండేవని కాకతీయ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డా. ఇందిరా పార్థసారథి చెప్పారు. తన జీవితంలో ఎదురైన సంఘటనలనే  కధలుగా మలచి ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందటం విశేషమని కొనియాడారు. 

విలక్షణమైన వ్యక్తిత్వం గల ఆమె 50వ ఏట రచనా వ్యాసంగం ప్రారంభించి సంచలనం సృష్టించారని ప్రముఖ రచయిత శ్రీ రమణ తెలిపారు. తన జీవితాన్ని ఒక సందేశంగా వదిలి వెళ్లారని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆమె ఒక ధృవతార అని ప్రశంసించారు. 

ఏ సమస్య ఎదురైనా ఆమె భరోసా ఇస్తూ, మార్గ నిర్ధేశం చేస్తూ ఉండేవారని ప్రముఖ జర్నలిస్ట్ ఉష తురగ రేవల్లి తెలిపారు. ప్రతి సంక్షోభ సమయంలో ఆమె మార్గదర్శకత్వం ఎన్నో సంస్థలకు, ఉద్యమాలకు ఆలంబనగా ఉండేదని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఆమె నిధులు వసూలు చేసి, వారికి సహాయం అందించారని ఆమె గుర్తు చేశారు. 

తిరుమల పర్వతాలను రెండింటికి కుదించాలని కుట్ర జరిగిన సమయంలో ఆ ఆలయ పవిత్రతను కాపాడటం కోసం జరిగిన మహోద్యమంలో ఎంతో ధైర్యంతో ఆమె ముందుండి పాల్గొన్నారని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి కార్యదర్శి సౌమిత్రి లక్ష్మణ చారి గుర్తు చేశారు. ఆమె ఒక కర్మజీవి, ధన్యజీవి అని  కొనియాడారు. 

ఆమెకు భారతీయ కుటుంభం జీవనం, జీవన విలువల పట్ల అపరిమితమైన విశ్వాసం ఉండేదని, వాటిని పరిరక్షించడం కోసం తన రచనలు, సామజిక కార్యక్రమాల ద్వారా విశేషంగా కృషి చేసేవారని బిజెపి మహిళామోర్చ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అరుణ జ్యోతి తెలిపారు. 

ఆమె అందరికి అమ్మ, అన్నపూర్ణ, ప్రతివారికి స్ఫూర్తిదాయకంగా ఉదనేవారని సోషల్ కాజ్ ఉపాధ్యక్షురాలు విజయ భారతి పేర్కొన్నారు. లయన్స్  క్లబ్ అధ్యక్షురాలు సిఏచ్ సౌజన్య, బి ఎచ్ ఇ ఎల్ మాజీ అదనపు జనరల్ మేనేజర్ డా. ఉదయ్ ఏం చౌదరి, ప్రజ్ఞ భారతి సంయోజక్ బి ఎస్ శర్మ, రాష్ట్ర సేవిక సమితికి చెందిన పి ఉమారాణి, అంజనీ మాత సేవ ట్రస్ట్ కు చెందిన ముదిగొండ సుష్మ, డా. రమ, ఏం వెంకట రమణ తదితరులు ప్రసంగించారు.