ఈశాన్య భారతం ఆగ్నేయాసియాకు ముఖద్వారం  

ఈశాన్య భారతం ఆగ్నేయాసియాకు ముఖద్వారం వంటిదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. థాయ్‌లాండ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ శనివారం ఇక్కడి నిమిబత్రు స్టేడియంలో థాయ్‌లాండ్‌లోని భారతీయ సంతతిని ఉద్ధేశించి మాట్లాడారు. హౌడీ మోడీ తరహాలో ఇక్కడ ఎన్నారైలతో ప్రధాని ముచ్చటించారు. 

థాయ్‌తో ఉన్న చారిత్రక, ప్రగాఢ స్నేహ సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు భారతదేశం సంకల్పించిందని చెప్పారు. ఈ క్రమంలో ఈశాన్య భారతం ఆగ్నేయాసియాకు గేట్‌వే అవుతుందని, అనేక రంగాలలో ఈ ప్రాంత దేశాలతో సహకారం విస్తరిస్తుందని తెలిపారు. వేలాది మంది భారతీయ సంతతికి చెందిన వారు స్టేడియంలో జరిగిన సవాస్దీ కార్యక్రమంలో పిఎం మోడీ పాల్గొన్నారు.

భారత్‌కు థాయ్‌లాండ్ సంస్కృతులు ఆచార వ్యవహారాలలో బోలెడు సారూప్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘తొలిసారిగా నేను థాయ్‌ వచ్చాను. ఇక్కడ భారతీయత ప్రతిబింబిస్తోంది. మనం పాటించిన విలువలు ఓ మెరుగైన ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు దోహదపడుతున్నాయి. ప్రపంచ వేదికల్లో మన ప్రాధాన్యం పెరుగుతోంది’’ అని మోదీ పేర్కొన్నారు.

ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని వెల్లడించారు. ఆసియాన్‌దేశాలకు ప్రాధాన్యతక్రమంలో భాగంగా తమ ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్ పాలసీని రూపొందించిందని చెప్పారు. 

గత ఏడాది అపూర్వ రీతిలో పది ఆసియాన్ దేశాల నాయకులు భారత గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఇండియా మయన్మార్ థాయ్‌లాండ్ త్రిముఖ రహదారి అందుబాటులోకి వస్తే ఇండియా థాయ్‌లాండ్ మధ్య నిరంతర ప్రయాణ అనుసంధానం, వాణిజ్య వ్యాపార ప్రక్రియకు దారితీస్తుందని తెలిపారు.

కాగా, ఉగ్రవాదం, వేర్పాటువాదానికి బీజాలు వేస్తున్న మూలాలను భారత్‌ నిర్మూలించిందని కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇంతవరకు అసాధ్యమైనవిగా కనిపించిన లక్ష్యాలను తాము అధిగమిస్తున్నామని చెప్పారు.    

ఇప్పటికే థాయ్‌లాండ్‌తో భారత్‌కు వైమానిక రవాణా అనుసంధానం విస్తృతంగా ఉందని, వారానికి కనీసం 300 విమానాలు రెండు దేశాల మధ్య నడుస్తాయని, థాయ్‌లోని కనీసం 18 ప్రాంతాలకు భారతదేశం నుంచి వైమానిక యానం ఉందని చెప్పారు. తమ సొంత నియోజకవర్గం వారణాసి నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమానంలో వెళ్లి రావచ్చునని , రెండు చారిత్రక పురాతన ప్రదేశాల మధ్య ఈ విధంగా బంధం పెరిగిందని పేర్కొన్నారు.