బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ

బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు, టీడీపీ బాల్కొండ ఇంఛార్జీ మల్లికార్జున రెడ్డి శనివారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారిని ఎంపీ ధర్మపురి అరవింద్ సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. అన్నపూర్ణమ్మ, మల్లికార్జున రెడ్డి రాకతో బాల్కొండ, ఆర్మూర్‌లో బీజేపీ మరింత బలపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.  

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే బీజేపీలో చేరినట్టు మాజీ ఎమ్మెల్యే, ఆమె తనయుడు పేర్కొన్నారు. టీడీపీని వీడాల్సి వస్తుందని తాము ఎన్నడూ అనుకోలేదని, బీజేపీ అవలంబిస్తున్న విధానాలు తమని ఆకర్షించడంతో.. పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. 

రాజకీయాల్లో ఉండి ప్రజా సేవ చేయాలనే పార్టీలోకి వచ్చామని స్పష్టం చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకు వస్తారన్న నమ్మకం అందరికీ ఉందని అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు.