తెలంగాణలో సగం ఆర్టీసీ బస్సులు ప్రైవేటుపరం!

తెలంగాణలో సగం ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. 29 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె `చట్టవిరుధం' అని మరోసారి స్పష్టం చేస్తూ నవంబర్ 5 రాత్రిలోగా కార్మికులు విధులలో చేరాలని అల్టిమేటం ఇచ్చారు. ఆ విధంగా చేరితే వారి ప్రయోజనాలు కాపాడతామని భరోసా ఇచ్చారు. లేని పక్షంలో మిగిలిన సగం ఆర్టీసీ బస్సులను సహితం ప్రైవేట్ పరం చేస్తామని హెచ్చరించారు. 

ప్రస్తుతం ఆర్టీసీ 10 వేల 400 బస్సులు నడుపోతోందని,  అందులో 2,100 బస్సులు ప్రైవేట్‌వేనని కేసీఆర్ తెలిపారు. మరో 3వేల బస్సులకు కాలం చెల్లిపోయిందని, కొత్త బస్సులను కొనుగోలు చేయగల స్థితిలో ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దానితో మొత్తం 5,100 బస్సులను ప్రైవేట్ పరం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు బాధ్యతా రహితంగా సమ్మె చేస్తున్నారని మండిపడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

ఈ సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మోటార్ వాహనాల సవరణ చట్టంలోనే ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ పరం చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారని పేర్కొన్నారు. వాస్తవానికి పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలలో ఇప్పటికే అత్యధిక సర్వీస్ లను ప్రైవేట్ వారే నడుపుతున్నారని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వమే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసినదని పేర్కొన్నారు. 

అయితే ప్రైవేట్‌ రూట్లలో ఇష్టానుసారం చార్జీలు పెంచడానికి లేదని, చార్జీల నియంత్రణ కమిటీ ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు. బస్‌ పాసుల రాయితీలు యధావిధిగా కొనసాగుతాయని సీఎం తెలిపారు. మేం బుల్డోజ్ చేయడం లేదు. యాజమాన్యం అదుపాజ్ఞల్లో పనిచేస్తేనే భవిష్యత్‌. లాభాలు వచ్చే రూట్లను ఆర్టీసీకి ఇస్తాం. కఠినమైన రూట్లను ప్రైవేట్ వాళ్లకు ఇస్తాం. ఆర్టీసీని విలీనం చేస్తే అంతటితో ఆగదు అని కేసీఆర్ వివరించారు.