మాజీ సీఎం సిద్ధరామయ్యవి పగటి కలలు  

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకొస్తుందని, తాను మరో సారి ముఖ్యమంత్రినవుతానని మాజీ సీఎం సిద్ధరామయ్య చేస్తున్న వ్యాఖ్యలు అర్థం లేనివని, ఆయనవన్నీ పగటికలలేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీ శ్రీరాములు ఎద్దేవా చేశారు. 

యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పూర్తి పాలన సాగిస్తుందన్నారు. సిద్దరామయ్య పెట్టే శాపనార్థాలు ఫలించేవి కావని స్పష్టం చేశారు. 100రోజులు పూర్తి చేసుకున్న బీజేపీ పరిపాలనపై తమ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. 

సిద్దరామయ్య చేస్తున్న విమర్శలపై సంబంధించి ఎలాంటి వేదికలోనైన ముఖా-ముఖి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు ఆయన వస్తారా..? అని సవాలు విసిరారు. ఆయన హయాంలో జరిగిన బియ్యం, ఐఏంఏ కుంభకోణాల్లో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిన విషయం పై ముందు సిద్ధరామయ్య స్పందించాలని డిమాండ్‌ చేశారు.

కాగా తుంగభద్ర జలాశయంలో పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోవడం వల్లే నీటి సామర్థ్యం తగ్గిపోయి రాయచూరు జిల్లాలోని చివరి ఆయకట్టుకు నీరందడం లేదని మంత్రి తెలిపారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా నవలి వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వార్‌ను ఏర్పాటు చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పారు. జిల్లాలోని రిమ్స్‌ బోధన ఆస్పత్రిలో రూ. 37కోట్లతో బాలికల కోసం వసతి గృహం నిర్మిస్తామని పేర్కొన్నారు. 

టిప్పుసుల్తాన్‌ చరిత్రకు సంబంధించి పాఠ్యంశాల్లో నుంచి తొలగించే అంశం మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంత్యుత్సవాలు నిర్వహించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.