తెలంగాణ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ఠ  

ఓ పోలీస్ అధికారి  కరీంనగర్  ఎంపీ బండి సంజయ్ పై  చేయి చేసుకోవడాన్ని  నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి  తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. వెంటనే  డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి  కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ఆ అధికారులను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఇది కేవలం కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదని  అర్వింద్ మండిపడ్డారు.  నిన్నటి వరకు బీజేపీ కార్యకర్తలు , నాయకుల మీద కక్ష సాధింపు చర్యలుగా తప్పుడు కేసులు బనాయించి,  వేధించిన పోలీసులు ఏకంగా కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల మీద తమ ప్రతాపాన్ని చూయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్  లో  కవిత, కరీంనగర్ లో వినోద్ రావులు ఓడిన నాటి నుంచి  కేసీఆర్ ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉందని ఆయన విమరించారు. రాష్ట్రంలో కేసీర్ పాలన శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని  ఆయన హితవు పలికారు. కేసీఆర్ రాక్షన పాలనకు చరమగీతం పలికే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. అప్పటి వరకు బీజేపీ కార్యకర్తలకు  అండగతా నిలబడతామని భరోసా ఇచ్చారు. 

దీని వెనక రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హస్తం ఉన్నదని, పోలీసుల చేత మహమూద్ అలీ ద్వారా కేసీఆర్ ఈ వ్యవహరం నడిపిస్తున్నట్టు స్పష్టంగా అర్దమవుతోందని అర్వింద్ ఆరోపించారు. 

కాగా, రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, పోలీసు రాజ్యం, నిజాం సర్కార్ పాలన కనిపిస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల పట్ల టీఆర్ఎస్​ సర్కారు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని విమర్శించారు. శుక్రవారం కరీంనగర్​లో ఆర్టీసీ డ్రైవర్​ బాబు అంతిమయాత్ర సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్​పై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. 

‘‘నిజాం కూడా స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిపై పోలీసులను ఉసిగొల్పి, జులుం చేసి ప్రజలను హింస పెట్టాడు. అదే పాలన ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కనబడుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. మొన్న సరూర్ నగర్​లో జరిగిన మీటింగ్ ను చూసి ప్రజలంతా ఆర్టీసీ కార్మికులవైపు ఉన్నారని సీఎంకు తెలిసొచ్చింది. అందుకే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు"అని విమర్శించారు. ఎంపీపై దాడులు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదని సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.