జగన్ పాలనలో భయం భయంగా జనం  

జగన్ ఐదు నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు భయపడుతూ బతికారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. మరో నాలుగున్నరేళ్లు ఎలా ఉండాలో అని ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు.  

‘‘మా పార్టీ వారిని కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం. చట్టం ముందు అందరూ సమానమేనని ఈరోజు కోర్టు తీర్పుతో వెల్లడైంది. జగన్‌పై నమోదైన కేసు వ్యక్తిగత హోదాలోనే కదా?  అయినా ప్రజల సమస్యలు తీర్చకుండా రాష్ట్ర అవతరణ దినోత్సవ‌ వేడుకలు ఎందుకు? మాకైతే అవతరణ వేడుకలకు ఎటువంటి ఆహ్వానం అందలేదు’’ అని తెలిపారు.  

ఏపీలో ఇసుక కృత్రిమ కొరతను ప్రభుత్వమే సృష్టించిందని విమర్శించారు. ప్రతిపక్షాలకు సమస్యగా కనిపించినా.. మంత్రులకు మాత్రం కనిపించడంలేదని ధ్వజమెత్తారు. లక్షలాది మంది కార్మికుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేదని సీఎం ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. 

చేతనైతే సమస్యను పరిష్కరించాలే కానీ.. సమస్యపై పోరాటం చేస్తున్న వారిపై వ్యక్తిగత దాడులు సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వం ఇదే తరహాలో చేస్తే అడ్రస్ లేకుండా పోయిందని గుర్తు చేశారు. తక్షణమే ఇసుక కొరతను నివారించాలని కోరారు. అలాగే ఒక్కో కార్మికునికి 10వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు. 

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్‌లో పాల్గొనడం లేదని కన్నా స్పష్టం చేశారు. కానీ తమ సంఘీభావం ఉంటుందని తెలిపారు. ఈ అంశంలో ఇతర నాయకులు ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఈనెల 4న మాత్రం ఇసుక సత్యాగ్రహం చేపడుతున్నట్లు ప్రకటించారు.

ఈనెల 10న బూత్ స్థాయి బిజెపి కార్యకర్తల సమ్మేళనం ఉంటుందని వెల్లడించారు. సిద్ధార్ధ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల బూత్ సభ్యులు, నాయకులు సమావేశం అవుతారని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జెపి నడ్డా ఈ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.