ఫడ్నవీస్‌కు పలువురు ఎమ్మెల్యేల మద్దతు 

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు వివిధ పక్షాల ఎమ్మెల్యేలు మద్ధతు ప్రకటించారు. పలు చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర శాసనసభ్యులు దేవేంద్ర ఫడ్నవీస్‌ ను కలిసి తాము ప్రభుత్వ ఏర్పాటుకు మద్ధతు ఇస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య పోరు సాగుతున్న నేపథ్యంలో పలు చిన్న పార్టీలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌కు జై కొట్టారు. 

బహుజన్ వికాస్ ఆగాధీకి చెందిన కిష్టిజ్ ఠాకూర్, పీజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీకి చెందిన శ్యాంసుందర్ షిండే, జన స్వరాజ్య శక్తికి చెందిన వినయ్ కోరీ, స్వతంత్ర శాసనసభ్యులు రవిరాణా, సంజయ్ మామాషిండే, గీతాజైన్, మహేష్ బాల్దీ, కిషోర్ జోర్గేవార్, వినోద్ అగర్వాల్, రాజేంద్ర రౌత్, ప్రకాష్ అన్నా అవాడేలు ఫడ్నవీస్ కు కలిసి తమ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. 

మహారాష్ట్రలో భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తడంతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని స్వతంత్ర ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ను కోరారు. శివసేన ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో సీఎం పదవిని పంచుకోవాలని డిమాండు చేస్తున్న నేపథ్యంలో స్వతంత్ర శాసనసభ్యులు బీజేపీకి చెందిన ఫడ్నవీస్ కు మద్ధతు ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.