నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం

రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ నగర పాలక సంస్థ క్రీడా మైదానం వేదికగా మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 

రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో దేశానికి స్వేచ్ఛావాయువులు లభించడంలో కీలకపాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోనున్నారు. దివంగత స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పరంగా సత్కరించనున్నారు. 

పింగళి వెంకయ్య, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, భోగరాజు పట్ట్భాసీతారామయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, కనె్నగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా, పొట్టి శ్రీరాములు, దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దుర్గ్భాయి దేశ్‌ముఖ్, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు, తెనే్నటి విశ్వనాథం తదితర స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబ సభ్యులకు ఈ మేరకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. 

ఈ సందర్భంగా సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చేనేత, హస్తకళల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అదరహో అనిపించేలా తెలుగు సంప్రదాయ వంటకాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రకాల తెలుగు రుచులు సిద్ధం అవుతున్నాయి. మహాత్మా గాంధీ 150వ జయంతిని గుర్తు చేసుకుంటూ గాంధీ చిత్రాలు, స్టాంపుల ప్రదర్శన చేస్తున్నారు.