పోలవరం నవయుగకు హైకోర్టులో ఎదురుదెబ్బ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో నవయుగ సంస్ధకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త కాంట్రాక్టరుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం అవకాశం కల్పించింది. దానితో సుమారు ఆరు నెలల తర్వాత తిరిగి పోలవరం పనులు ప్రారంభమయ్యే అవకాశాలు నెలకొన్నాయి. 

పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం గతంలో ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇచ్చిన స్టే ఎత్తివేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇదే సమయంలో నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారణ ముగించింది. 

విచారణ సందర్భంగా ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్‌కు విలువ ఉండదన్న అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు ఎన్‌క్యాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజక్షన్‌ను పక్కకు పెడుతూ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

కాగా, గోదావరిలో వరద తగ్గిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి హైకోర్టు తీర్పు ప్రతిపక్షానికి చెంపపెట్టు వంటిదని విమర్శించారు. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని తెలిపారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని తెలిపారు.

దాదాపు ఆరు నెలల విరామం అనంతరం ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు నాల్గవ కాంట్రాక్టు సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ పనులు చేపట్టడానికి నేటి నుంచి రంగంలోకి దిగనుంది. ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానంలో భాగంగా పోలవరం టెండర్‌ను దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టడానికి సర్వ సన్నద్ధమయ్యింది. అగ్రిమెంట్, బ్యాంకు గ్యారంటీ (బీజీ)లు, మొబిలైజేషన్ అడ్వాన్సు చెల్లింపు తదితర ప్రక్రియలు పూర్తి కావాల్సివుంది. 

పోలవరం పనులు నవంబర్ మొదటి నుంచి ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ముందస్తుగా చెప్పినట్టుగానే అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిర్ధేశిత గడువులోగా పనులు చేపట్టడానికి వీలుగా వర్క్ ఆర్డర్ కంటే ముందు వర్క్ అలాట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.