కాశ్మీర్ తొలి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ముర్ము  

జమ్మూ కశ్మీర్ తొలి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా గిరీష్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్‌ ఐఎఎస్‌ రాధాకృష్ణ మాధుర్‌ లద్దాఖ్‌ ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో.. జమ్మూ కశ్మీర్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను గురువారం రద్దు చేశారు.

పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. జమ్మూ-కశ్మీర్‌ ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ రెండో కేంద్ర పాలిత ప్రాంతంగా గురువారం నుంచి పాలనా వ్యవహారాలు సాగుతాయి. ఈ విభజనతో దేశంలో కేంద్ర పాలిత రాష్ట్రాల సంఖ్య ఏడుకు పెరుగుతాయి. రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గుతాయి. 72 ఏళ్ల కశ్మీర్‌ సంక్షుభిత చరిత్రలో ఇదో మలుపు. 

1947 అక్టోబరు 26న అప్పటి కశ్మీర్‌ మహారాజా హరిసింగ్‌ భారత యూనియన్‌లో రాష్ట్రాన్ని విలీనం చేస్తూ- ‘ఇన్‌స్ట్రుమెంట్‌ ఆఫ్‌ ఏక్సెషన్‌’ పై సంతకం చేశారు. జమ్మూ కశ్మీర్‌ తన రాష్ట్ర హోదాను కోల్పోయింది. ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఈ ఆగస్టు 5న ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 30 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అర్థరాత్రి 12 గంటలు దాటగానే ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం అన్న పదాన్ని తీసేసి కేంద్ర పాలిత ప్రాంతం అని మార్పు చేసింది. ఇకపై శాశ్వత నివాసులు, వారసత్వంగా వచ్చే రాష్ట్రాంశాలు.. మొదలైనవి ఉండబోవని స్పష్టం చేసింది. మిగిలిన అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే కేంద్ర చట్టాలన్నీ ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని పేర్కొంది. తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జన్మదినమైన అక్టోబరు 31 నాడే కశ్మీర్‌ పూర్తిగా భారత్‌లో విలీనమవుతుండడం విశేషం.