రాజధాని అమరావతి ఎక్కడికీ వెళ్లదు

‘‘ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని. అది ఎక్కడికీ వెళ్లదు. సమస్యను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తా. పరిష్కారానికి కృషి చేస్తా’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ భరోసా ఇచ్చారు. బుధవారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. రాజధాని మార్పు ప్రకటనతో గందరగోళం ఏర్పడిందని, కేంద్రం స్పందించి రాజధానిపై ప్రకటన చేయాలని ఆయనకు విన్నవించారు. 

దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన ఈ  విధంగా హామీ ఇచ్చారని రైతులు మీడియాకు తెలిపారు. అనంతరం తాడేపల్లిగూడెంలో జరిగిన గాంధీ సంకల్పయాత్ర ముగింపు సభలోనూ రాజధాని ప్రస్తావన తీసుకువచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోందని విచారం వ్యక్తం చేశారు. గతంలో రాజధాని నిర్మిస్తామని రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేస్తూ ఐదేళ్ళు గడిచిన తరువాత అక్కడ రాజధాని నిర్మిస్తామో? లేదో? తెలియదంటూ ప్రస్తుత ప్రభుత్వం నాన్చివేత ధోరణి అనుసరిస్తోందని విమర్శించారు. రాజధాని రైతుల హక్కులను హరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని తేల్చిచెప్పారు. 

రాష్ట్రంలో రెండు బస్తాల ఇసుక పోయిందంటూ పీఎ్‌సకు వెళ్లి ఫిర్యాదు చేసే స్థాయికి అవినీతి చేరుకుందని తూర్పారబట్టారు. "ఏపీలో గత నాలుగు నెలల్లో ప్రజలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలన్నీ వైసీపీ కార్యకర్తలు, అభిమానులకే చేరినట్లు మా వద్ద సమాచారం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక వైసీపీ కార్యకర్తల కమిటీల ద్వారా చేయడం ఏమిటి?’ అని రాంమాధవ్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడ, తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 

ఏపీలో అవినీతి కోసమే పథకాలు అమలవుతున్నాయని ధ్వజమెత్తారు. పోలవరం నుంచి ఇసుక వరకూ అంతా అవినీతిమయంగా మారిందని విమర్శించారు. గుంటూరులో జోరువానలో బైకు ర్యాలీ నిర్వహించిన బీజేపీ శ్రేణులు ఆ తరువాత పాదయాత్రను నిర్వహించాయి. మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం రాంమాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఉప్పు రైతుల కష్టాలు దూరం చేసేందుకు ఆనాడు గాంధీ ఉప్పుసత్యాగ్రహం నిర్వహించారు. ఈ రోజు ఏపీ రాజధాని రైతులు, కార్మికులు పడుతోన్న ఇక్కట్లను దూరం చేసేందుకు మా ఈ పాదయాత్ర సమర్పితం చేస్త్తున్నాం’ అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పోలవరం మొదలు ఇసుక వరకు అక్రమాలు, అవినీతితో నిండిపోయిన పరిస్థితుల్లో నీతివంతమైన రాజకీయ వ్యవస్థను తీసుకురావడం కోసం, స్వచ్ఛమైన భారతదేశ నిర్మాణం కోసం ఈ పాదయాత్రను అంకితం చేస్తున్నామని తెలిపారు.