పూర్తి కాలం అధికారంలో ఉంటాం

కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై నవంబర్ 2కు వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఎడిటర్స్ గిల్డ్ ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీజేపీ అధినాయకత్వం ముఖ్యమత్రిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న కథనాలను కొట్టిపారవేసారు. ‘నాకు పూర్తిస్వేచ్ఛ’ ఉందని బదులిచ్చారు. 

‘సీఎంగా నా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాను. నా నాయకత్వాన ప్రభుత్వం సమస్యలను అధిగమించి వంద రోజులు పూర్తి చేసుకుంటోంది. నేను ఏం చేస్తున్నానో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. యంత్రాంగాన్ని ఒకే తాటిపైకి తెచ్చి సుపరిపాలన అందిస్తున్నాను’అని పేర్కొన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లూ తన విధులు సక్రమంగానే నిర్వర్తిస్తున్నట్టు కర్నాటక సీఎం స్పష్టం చేశారు. 

తన నిర్దేశించి లక్ష్యాలు వందకు వంద శాతం విజయవంతమైనట్టు ఆయన ప్రకటించారు. ‘మిగతా మూడున్నర ఏళ్ల పాలన పూర్తి చేస్తాను. నా ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుంది. కేంద్ర నాయకత్వం కూడా నాపై పూర్తి విశ్వాసంతో ఉంది’అని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని యడియూరప్ప చెప్పారు. 

 కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో జూలై 26న బీఎస్ యడిరప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీ బలపరీక్షలో ఓటమిపాలైంది. అధికార పార్టీ 99-105 ఓట్ల తేడాతో తీర్మానం ఓడిపోయింది. అయితే యడియూరప్ప ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండదని, మధ్యంతర ఎన్నికలు అనివార్యమంటూ ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో చేస్తున్న వాఖ్యలను ప్రకటనలు ఆయన తోసిపుచ్చారు. 

‘మాది జాతీయ పార్టీ. కేంద్ర నాయకత్వం కింద కొన్ని పరిమితులకు లోబడి మేం పనిచేయాల్సి ఉంటుంది. అలాగని మాపై హైకమాండ్ ఎలాంటి నియంత్రణ చేయడం లేదు’అని ఆయన వివరించారు. కాగా ఉప ఎన్నికలు జరగనున్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12-13 సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు తమకు పెద్ద సవాల్‌గా ఆయన పేర్కొన్నారు.

ఇలా ఉండగా, అసెంబ్లీ సమావేశాల కవరేజీకి వెళ్లే మీడియాపై ఆంక్షలు విషయం స్పీకర్‌తో మాట్లాడతానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కెమెరామెన్‌లపై ఆంక్షలు తన దృష్టికి వచ్చిందన్న సీఎం ‘స్పీకర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా. వచ్చే సమావేశాల్లో అలాంటివి పునరావృతం కాకుండా చూస్తా’అని ఆయన ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్ విశే్వశ్వర హెగ్డే కగేరీ ఇటీవల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు విధించారు.