కేంద్రం ఇచ్చిన నిధుల్లోనే ఎక్కువ అవినీతి 

రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో పోలవరంలో జరిగిన అవినీతికంటే సంక్షేమ పథకాల అమలుకోసం కేంద్రం ఇచ్చిన నిధుల్లోనే ఎక్కువ అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఉపాధి హామీ పథకం కింద రూ.40 వేల కోట్లు, నీరు-చెట్టు పథకానికి రూ.26 వేల కోట్లు నిధులు అందించిందని, అయితే ఈ నిధులతో చెట్టును తవ్వి, మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. 

వైద్య శాఖకు సంబంధించి వ్యాక్సిన్ రవాణాకు ఏడాదికి కోటి రూపాయలు, పీహెచ్‌సీల్లో గర్భిణులకు, బాలింతల భోజనాలకు రూ.2.5 కోట్లు, కాన్పుల నిమిత్తం రూ.2.5 కోట్లు రాష్ట్రానికి ఇస్తే ఈ సొమ్ములన్నీ దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఈ నిధుల ఖర్చుకు ఆడిట్ లేకపోవడంతో దుర్వినియోగం చేయడమేకాక, నిధులిచ్చిన ప్రధాని మోదీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ జరిగిందని, వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని మండిపడ్డాయిరు. 

కేంద్రం ఇచ్చే నిధుల సమాచారం ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత రాష్ట్రానికి ఉందని, అయితే గత ప్రభుత్వంలో అది ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ పరిపాలనలో హామీలు వర్షధారలా కురిపిస్తున్నారని, వాటి అమలుకు నిధులు ఎక్కడ నుండి తెస్తారో ప్రజలకు తెలపాలని నిలదీశారు. గత ప్రభుత్వం రూ 2.5 లక్షల కోట్లు అప్పుచూపించి వెళ్లారని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రస్తుతం నవరత్నాలు పేరుతో ప్రజలకు ఇస్తున్న హామీలను ఏవిధంగా నెరవేరుస్తారో చెప్పితీరాలని డిమాండ్ చేశారు. 

చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థికసాయం ప్రకటించారని, దీనికంటే మగ్గాల ద్వారా పనికల్పిస్తే ఏడాది పొడవునా వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత వలన అనేక రంగాలకు సంబంధించిన కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి తక్షణమే ఇసుక సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టాలని హితవు చెప్పారు.