మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి చూపిస్తాం  

కేసీఆర్  ప్రభుత్వం దిగిరాకపోతే తడాఖా చూపిస్తామని ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో హెచ్చరించారు. ట్యాంక్​ బండ్​పై మరో మిలియన్ మార్చ్​కు వెనకాడబోమని తేల్చిచెప్పారు. సర్కార్​ ఇదే నియంతృత్వ  పోకడలకు పోతే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి చూపిస్తామని నినదించారు. 

పక్క రాష్ట్రం ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మనదగ్గర  ఎందుకు సాధ్యంకాదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని నిర్బంధాలు పెట్టలేదని మండిపడ్డారు. అసలు ఆర్టీసీ నష్టాల్లో లేదని, ప్రభుత్వమే నష్టాల్లోకి నెట్టిందన్నారు. సీఎం కేసీఆర్​ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టి, బంధువులు, అనుచరులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. 

తమ జెండాలు, పార్టీలు వేరైనా అజెండా మాత్రం ఒక్కటేనని చెప్పారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా సమ్మె విరమించవద్దని, తాము,  తెలంగాణ సమాజం అండగా ఉంటామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. 

ఆర్టీసీ సమ్మెలో భాగంగా హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్​ స్టేడియంలో బుధవారం ‘సకల జనభేరి’ సభను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నిడిపోల నుంచి భారీగా కార్మికులు తరలివచ్చారు. స్టేడియం మొత్తం నిండిపోగా.. పరిసరాల్లో కూడా ఎక్కడ చూసినా కార్మికులే కనిపించారు. సర్కార్​ తీరువల్ల చనిపోయిన 16 మంది కార్మికుల పట్ల సంతాపంగా నిమిషంపాటు  మౌనం పాటించారు. 

మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగా.. కోర్టు విధించిన గడువు కంటే (సాయంత్రం 6గంటలకంటే) మూడు నిమిషాల ముందే ముగించారు. కళాకారుల ఆటాపాటలతో స్టేడియం మార్మోగింది.  గురువారం రాష్ట్రవ్యాప్తంగా డిపోల దగ్గర  24 గంటలపాటు దీక్ష చేస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని ధ్వజమెత్తుతూ ఎన్ని ఇబ్బందులెదురైనా గమ్యాన్ని చేరే వరకు పోరాటం ఆగదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. పోరాటం హక్కుల కోసం మాత్రమే కాదని, ప్రజా రవాణాని బతికించుకోవడానికని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతూ కార్మికులను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. 

కేసీఆర్ రాష్ట్రంలో సంస్థలను నిర్వీర్యం చేస్తూ అందరూ కాళ్ల దగ్గరికి రావాలని భావిస్తున్నరని బిజెపి నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు.  కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి, కమీషన్లు దొబ్బడానికి డబ్బులు ఉన్నాయి కానీ ఆర్టీసీ కార్మికులకు ఇవ్వడానికి మాత్రం లేవంటే అందరూ నవ్వుతున్నరని చెప్పారు. కేసీఆర్ పెద్ద అవకాశవాదని చెబుతూ  అవసరానికి వాడుకొని వదిలేస్తరని తెలిపారు.