బిజెపికి ఎవరితోనూ పొత్తు అవసరం లేదు  

బిజెపికి ఏపీలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని,  వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి   రాంమాధవ్‌  స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని  ప్రారంభిస్తూ రాష్ట్రంలో ఏ పార్టీకి జూనియర్‌ పార్టీగా వ‍్యవహరించమని తేల్చి చెప్పారు.  

సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు అందేలా చేస్తామని చెబుతూ  ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని తెలిపారు. తన పార్టీ నుంచి వలసలను ఆపేందుకు బీజేపీతో పొత్తు గురించి టిడిపి చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పరిస్థితి ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. 

గాంధీజీ సంకల్పయాత్ర ర్యాలీని గుంటూరు జిల్లాల్లో ప్రారంభిస్తూ  టీడీపీ మునిగిపోతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆ పార్టీలో ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు. వలసలను ఆపటానికి బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ప్రత్యామ్నాయంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని రాంమాధవ్ తెలిపారు.