అవినీతి క్యాన్సర్‌ కంటే భయంకరమైనది 

సమాజంలో అవినీతి క్యాన్సర్‌ కంటే భయంకరమైనదని, దానిని పూర్తిగా వెలివేయాలని, అప్పుడే ప్రజాస్వామ్య ఫలాలను అందరూ ఆస్వాదిం చగలుగుతారని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ స్పష్టం చేశారు. అవినీతి దేశ సంపదను దోచుకోవడానికి దారితీస్తోందని, దీని నిర్మూలించాల్సిన బాధ్యత ఉద్యోగులు, ప్రజలకూ ఉందని తెలిపారు. 

 

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కేంద్రం ఉద్యోగుల సంక్షేమ సంఘం సమన్వయ కమిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌-2019 కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతూ సుపరిపాలన అనే ప్రాథమిక సూత్రాల్లో పారదర్శకత అనేది అత్యంత కీలకమైనదని, అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అది కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. సమాచారహక్కుచట్టం దేశ పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని వివరించారు. 

 

అవినీతి, అవకతవకలు పరిపాలనా యంత్రాంగం బాధ్యతారాహిత్య వైఖరికి వ్యతిరేకంగా పోరాడటానికి దేశ ప్రజలకు అధికారం ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారతదేశం ఎప్పుడూ గర్విస్తుందని తెలిపారు. ఆర్‌టిఐ చట్టాన్ని అమల్లోకి తీసుకురాడం ద్వారా భారతదేశం మరింత జవాబుదారీతనం, పారదర్శకంగా మారిందని గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. 

 

తొలుత ఆదాయపన్ను చీఫ్‌ కమిషనర్‌, కేంద్ర ఉద్యోగుల సంక్షేమ సమన్వయ కమిటీ ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి మట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన 23 రంగాలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ అవినీతికి ముగింపు పలికినప్పుడే క్షేత్రస్థాయి వరకూ ప్రభుత్వ ఫలితాలు చేరతాయని చెప్పారు. ఇంటిలిజెన్స్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎన్‌. చంశ్రేఖర్‌, నేషనల్‌ స్టాటిస్టికల్‌ విభాగ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.కిరణ్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు.

కాగా, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అనాథ పిల్లల మధ్య దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పిల్లలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సతీమణితోపాటు ఆయన కార్యదర్శి మీనా తదితరులు పాల్గొన్నారు.