ఇసుక సరఫరా చేయలేని అసమర్థ పాలన

రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన ఇసుకను సరఫరాచేయలేని అసమర్థ పాలన నడుస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం టేకిశెట్టివారిపాలెం గ్రామంలో  ఆయన గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొనగా ఇసుక కొరత కారణంగా తాము ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ భవన నిర్మాణ కార్మికులు కన్నాకు  వినతిపత్రం సమర్పించారు. 

దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఇసుక సరఫరాపై సరైన నిర్ణయం తీసుకోలేని రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణమవుతోందని మండిపడ్డారు.  లక్షలాదిమంది కార్మికులు ఆకలి కేకలు పెడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఇసుక సరఫరాపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 

ఈ పాదయాత్రలో మలికిపురం సాలిపేట సమీపంలో చేనేత కార్మికులు నివాసం ఉన్న ప్రాంతంలో ఆగి లక్ష్మీనారాయణ ఆగి నూలుకండెలు చుట్టే రాట్నం ఒడికారు. 

కాగా, తమను ఏదో ఉద్ధరించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో 150 సీట్లతో వైసీపీకి అధికారం ఇస్తే రిటర్న్‌గిఫ్ట్‌గా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడం తప్పించి ఈ ప్రభుత్వానికి మరొకటి చేతకాదంటూ ట్విట్టర్ వేదికగా కన్నా ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి కార్మికులకు రూ.150 కూలీ కూడా దొరకని పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.